Tuesday, May 21, 2019
Follow Us on :

అవును.. హైదరాబాద్ లో మెట్రో బస్సునే కొట్టేశారు

By BhaaratToday | Published On Apr 25th, 2019

ఇప్పటి వరకూ బైక్, కార్లను కొట్టేసిన దొంగల గురించి విన్నాం కానీ..! ఏకంగా బస్సునే కొట్టేశారు. అది కూడా డిపోలో ఉన్న బస్సును. హైదరాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో బస్(AP11Z 6254) ను కొట్టేశారు. ఈ బస్సు రోజూ కుషాయిగూడ-ఆఫ్జల్‌గంజ్ మధ్య నడుస్తోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో సీబీఎస్ చేరుకుంది. ఆరోజు ట్రిప్ ముగిసింది. డ్రైవర్ వెంకటేశం, కండక్టర్ రాహుల్ బస్సును సీబీఎస్ డిపో-1లో పార్క్ చేసి రెస్ట్ రూమ్‌కి వెళ్లి పడుకున్నారు. బుధవారం ఉదయం లేచి చూస్తే బస్సు కనిపించలేదు. వెంటనే డిపో అధికారులకు సమాచారం ఇచ్చారు. 

సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా మెట్రో బస్సును మంగళవారం రాత్రి 11.02కి పార్క్ చేయగా 12.03 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. రాత్రివేళ కావడంతో వారి ముఖాలు సరిగా కనిపించలేదు. ఈ బస్సు రంగమహల్ హోటల్ మీదుగా నగరం దాటి నాందేడ్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అదేరోజు 1 గంట సమయంలో బస్సు తూఫ్రాన్ టోల్‌గేట్ దాటినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.