Thursday, July 18, 2019
Follow Us on :

మీరు మెట్రో స్టేష‌న్ వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త

By BhaaratToday | Published On Mar 21st, 2019

అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీకి ప్రారంభ‌మైన మెట్రోలో ఎక్కేందుకు జ‌నాలు ఎగ‌బ‌డుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి అందుబాటులోకి వ‌చ్చిన మెట్రోతో చాలా అనుభూతి పొందుతున్నారు ప్ర‌యాణికులు. అయితే మెట్రో స్టేష‌న్‌లోకి వెళ్లే ముందు కొంచెం జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంటుంది. ఎందుకంటే మెట్రో నిబంధనలు పాటిస్తే మెట్రో జర్నీ భలే సరదాగా ఉంటుంది. స్టేషన్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బ‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్ల మాదిరిగా కాకుండా ఎయిర్‌పోర్టులో ఎలా వ్యవహరిస్తామో అలానే నడుచుకోవాల్సి ఉంటుంది. మెట్రోలో గమ్య స్థానం దాటి వేరే స్టేషన్‌లో దిగితే జేబుకు చిల్లు పడుతుంది. మెట్రోలో ప్రయాణించే వారు గమ్య స్థానానికి టోకెన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎంట్రన్స్‌లో ఉన్న యంత్రాల వద్ద చూపించి ప్రయాణించాలి. తర్వాత గమ్య స్థానంలో ఎగ్జిట్‌లో ఆ టోకెన్‌ మెషిన్‌లో వేసి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కొంత మంది ప్రయాణికులు గమ్య స్థానం రాగానే రద్దీ కారణంగా మెట్రో దిగలేకపోయారు. మరుసటి స్టేషన్‌లో దిగి ఎగ్జిట్‌ అవుతుండగా యంత్రాలు ఈ విషయాన్ని పసిగట్టాయి. అధికారులు టొకెన్‌కు రెండింతలు వసూలు చేసి వదిలిపెట్టారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లో ప్రయాణికులతో పాటు సరదాగా కబుర్లు చెప్పుకునే వారు కనిపిస్తుంటారు. అనేక మంది రెండు మూడు గంటలు రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫాంపై కాలక్షేపం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇలాగే మెట్రోకు వచ్చిన వారికి నిర్వాహకులు విధించిన జరిమానాకు కళ్లు బైర్లు కమ్మాయి. మెట్రోలో కాలక్షేపం చేసే వారు ఉండకూడదు అనే ఉద్దేశ్యంలో అధికారులు ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. మొదటి అరగంట ఉచితంగా స్టేషన్‌లో ఉండనిచ్చినా తర్వాత పది నిమిషాలకోసారి పది రూపాయల చొప్పున జరిమానా విధించే ఏర్పాట్లు చేశారు.