Saturday, August 24, 2019
Follow Us on :

తెలంగాణ‌లో ఆడ‌వారు బ‌య‌ట తిర‌గొద్దా...! అసలు ఏం జరుగుతోంది

By BhaaratToday | Published On Jun 12th, 2019

    తెలంగాణ‌లో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు
    పోలీసుల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్న మిస్సింగ్ కేసులు
    అదృశ్య‌మైన వారిలో విద్యార్థులు కూడా..
    ప్ర‌జ‌ల గుండెల్లో ద‌డ పుట్టిన మిస్సింగ్ కేసులు

అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది.. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి ఒకటీ రెండు మిస్సింగ్‌కేసులు నమోదవుతున్నాయి.. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువతులు అదృశ్యమైపోతున్నారు.. వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు..? మనుషుల అక్రమ రవాణా జరుగుతోందా..? లేక తప్పిపోతున్నారా..? వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తున్నారా..? ఎక్కడికైనా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతున్నారా..? ఇంతకు ఏం జరుగుతోంది.. అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు.  

తెలంగాణలో పోలీసులను అదృశ్య కేసులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ కేసుల్ని ఛేదించడం సవాల్‌గా మారింది. విద్యార్థులు, యువతీ, యువకులు నుంచి వివాహితల వరకు పలువురు అదృశ్యం అవుతూనే ఉన్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా లోతుగా విచారణ కరవవుతోంది. ఏళ్ల తరబడి కొన్ని కేసులు పెండింగులోనే ఉన్నాయి. వరుస అత్యాచారాలు, హత్య చేసి బావిలో పాతిపెట్టిన హాజీపూర్ ఘటన నేపథ్యంలో ఇప్పుడు అదృశ్యం కేసులు చర్చనీయాంశమవుతున్నాయి. 

దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న మిస్సింగ్‌కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు అంతగా శ్రద్ధచూపడం లేదనే విమర్శలు కూడా పెల్లుబుకుతున్నాయి. దీంతో కొందరు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇక అదృశ్యమవుతున్న వారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి.. 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసువారి సంఖ్యే ఎక్కువ. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన హజీపూర్ ఉదంతం మరువకముందే...మిస్సింగ్ కేసులు హడలెత్తిస్తున్నాయి. ఈ నెలలో రాష్ట్రంలో 545 అదృశ్య కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లు అంటే రాజధాని పరిధిలోనే 296 మంది కనిపించకుండా పోయారు.

ఇక మృతి చెందిన వారిని మరిచిపోకపోయినా.. వారికి సంబంధించిన జ్ఞాపకాలు అప్పుడప్పుడు నెమరవేసుకుంటుంటారు. కానీ ఆకస్మికంగా ఎవరైనా అదృశ్యమైపోతే.. నెలల తరబడి, ఏళ్ల తరబడి వారి ఆచూకీ తెలియకపోతే ఆ కుటుంబం ఎదురుచూపులతో అనుభవిస్తున్న నరకయాతన వర్ణణాతీతం.ఇక పోలీసుల రికార్డుల్లో నమోదు అవుతున్న కేసుల కంటే..అసలు పోలీసు దృష్టికి రానివి ఎన్నో ఉన్నట్టు కూడా సమాచారం. మారుమూల గ్రామాల్లో యువతీయువకుల అదృశ్యాల గురించి ఫిర్యాదు చేయడానికి కుటుంబ సభ్యులే వెనుకంజవేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నమోదు అయిన కేసులను కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. వారికి ఉన్న పనుల ఒత్తిడి, ప్రాధాన్యతల దృష్ట్యా వీటివైపు దృష్టిసారించలేకపోతు న్నారని అధికారులు చెబుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో మనుషుల అదృశ్యంతో జనం గుండెల్లో దడ పుడుతోంది.

మొత్తానికి మనుషుల అదృశ్యం కేసుల్లో పోలీసుల దర్యాప్తులో వేగం పెరగాల్సిన అవసరం ఉంది. అదృశ్య కేసుల్లో లోతుగా దర్యాప్తు చేయకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ప్రజలు అంటున్నారు.