Friday, July 19, 2019
Follow Us on :

రేపే ఎన్నిక‌ల‌కు పోలింగ్‌

By BhaaratToday | Published On Mar 21st, 2019

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల స్థానాల ఎన్నికలకు రంగం సిద్దమైంది. మార్చి 22న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 26న  ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉపాధ్యాయ సంఘం నాయకులే అధిక సంఖ్యలో బరిలో ఉన్నారు. వారిలో కొంతమందిని పార్టీలు బలపరుచగా, మరికొంతమంది స్వతంత్ర్య అభ్యర్ధులుగా బరిలో దిగుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్ధులకు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలకు నాలుగు జిల్లాల్లోనూ 35 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కొందరు నామినేషన్లు ఉపసంహరించుకోగా...18 మంది మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షా 9 వేల 82 మంది పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 

పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్లు:
ఆదిలాబాద్ జిల్లాలో : 77 వేల 018 మంది
జగిత్యాల జిల్లాలో 16 వేల 98 మంది
కామారెడ్డి జిల్లాలో 10 వేల 253 మంది
క‌రీంనగర్  లో 36 వేల 803 మంది
కొమురం భీం ఆసిఫాబాద్ లో 4వేల 110 మంది
మంచిర్యాల జిల్లాలో 13 వేల 242 మంది
మెదక్ జిల్లాలో  7 వేల 470 మంది
నిర్మల్ జిల్లాలో 12 వేల 063 మంది
నిజామాబాద్ జిల్లాలో 22 వేల 511 మంది
పెద్దపల్లి జిల్లాలో 15 వేల 530 మంది
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 వేల 252 మంది
సిద్దిపేట జిల్లాలో 14 వేల 990 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. 

ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గ్రూప్ 1 ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి, బీజెపీ నుండి పోల్సాని సుగుణాకర్ రావు, యువ  తెలంగాణ నుండి ప్రముఖ జర్నలిస్ట్ రాణి రుద్రమ  ప్రధాన అభ్యర్ధులుగా పోటీలో ఉన్నారు. సామాజిక, రాజకీయ రంగాల్లో కొనసాగుతున్న వారు కూడా ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. ఏబీవీపీ మాజీ నాయకుడు గురువుల రణజిత్ మోహన్, ఎడ్ల రవి కుమార్, కేశిపెద్ది శ్రీధర్ రాజు, ప్రవీణ్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎన్నికల బరిలో ఉన్నారు. 

టీఆర్ఎస్ అభ్యర్ధి... ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్ రావు గత ఆరు నెలలుగా ఉమ్మడి నాలుగు జిల్లాల్లో విస్తృతమైన ప్రచారం చేస్తూ...గ్రాడ్యుయేట్ ఓటరు నమోదులో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. కానీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రైవేట్ స్కూల్ సమస్యలపై హామీ ఇస్తూ, యాదగిరిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరడంతో, ఆయన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. 
అయితే టీఆర్ఎస్ పార్టీ మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ ను తమ అభ్యర్ధిగా ప్రకటించింది. 2007 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి సివిల్ సర్వీస్ కు ఎంపికయ్యారు. కానీ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని పార్టీ హామీ ఇవ్వడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. చట్టసభల్లో బలమైన వాదనలు వినిపించడం కోసం మామిండ్లను బరిలో ఉంచామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటల్లాంటి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలో విద్యావంతులు తనకే ఓటేస్తారనే ఆశాభావంతో చంద్రశేఖర్ ఉన్నారు.

మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. రాష్ట్ర మంత్రిగా తాను చేసిన అభివృద్ధి పనులు కూడా గెలుపునకు దోహదపడతాయని అంటున్నారు. రాష్ట్రం లో  నిరుద్యోగులైన యువకులు, ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో లేవనేత్తడానికి ప్రజా గొంతుక కావాలని, ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజల తరుపున ప్రశ్నించే గొంతునై టీఆర్ఎస్ భరతం పడతానని జీవన్ రెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం బీజేపీ పార్టీ పూర్తిగా వ్యూహాత్మకంగా వ్యవహరించి  న్యాయవాది, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోల్సాని సుగుణాకర్ రావుని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపింది. విద్యార్ధి రాజకీయాల నుండి బీజేపీ తదితర అనుబంధ సంస్థల ద్వారా విద్యార్ధి సమస్యల పై పోరాటం చేసిన పోల్సాని, విద్యాభ్యాస సమయం లో వరంగల్ ఆర్ట్స్ కళాశాల విద్యార్ధి సంఘం అధ్యక్షునిగా చేసారు. నిరుద్యోగ యువతకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని పట్టభద్రులకు సుగుణాకర్ రావు హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు.

యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు, ప్రముఖ జర్నలిస్ట్ రాణిరుద్రమ పట్టభద్రుల స్థానానికి చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు. పట్టభద్రులైన యువ ఓటర్లతో పాటు విద్యావంతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమ సంఘాల మద్దతు తనకు లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మద్దతు లభించడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తాను గెలిస్తే శాసనమండలి విలువలు కాపాడుతానని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర్య అభ్యర్ధులు సైతం ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రసవత్తరంగా సాగుతున్న ఈ ఎమ్మెల్సీ పోరులో పట్టభద్రులు ఎవరికి పట్టం కడుతారో చూడాలి.