Friday, July 19, 2019
Follow Us on :

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారు

By BhaaratToday | Published On Apr 1st, 2019

ఏపీ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘‘మహాభారతానికి జన్మనిచ్చిన రాజమహేంద్రికి ప్రణామాలు. ఆదికవి నన్నయ, కందుకూరి వీరేశలింగం, దామెర్ల రామారావులాంటి ప్రజాసేవకులు పుట్టిన నగరం ఇది’’ అంటూ తన ప్రసంగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఐదేళ్లలో దేశ ప్రగతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. కాకినాడను స్మార్ట్‌సిటీగా చేయడమే కాకుండా, గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాజెక్టులు తీసుకొచ్చామన్నారు. 

గత 40 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మోదీ ఆరోపించారు. తొలి కేబినెట్‌ భేటీలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని.. ఇప్పటి వరకు రూ.7వేల కోట్ల నిధులిచ్చామని చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనాలను తెదేపా ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందన్నారు. ఈవిధంగా అంచనాలు పెంచుకోవడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని మోదీ దుయ్యబట్టారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. 

సీఎం చంద్రబాబు స్టిక్కర్‌ బాబుగా మారారని ప్రధాని దుయ్యబట్టారు. ప్రతి కేంద్ర పథకంపైనా చంద్రబాబు స్టిక్కర్‌ తగిలిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ యోజనపైనా స్టిక్కర్‌ పెట్టారన్నారు. చంద్రబాబు పరిస్థితి ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడిలా మారిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సేవా మిత్ర యాప్‌ ద్వారా ప్రజలకు తెదేపా సేవ చేయడం లేదని ఆరోపించారు. ‘సేవ లేదు.. మిత్రులు కాదు.. ప్రజల వివరాలు దొంగిలించారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌లకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. వాళ్ల కుటుంబాల వికాసం కోసమే ఆ పార్టీలు పనిచేస్తుంటాయన్నారు.