Thursday, September 19, 2019
Follow Us on :

మంత్రులకు టార్గెట్లు..కరప్షన్ కింగులకు రిటైర్మెంట్లు

By BhaaratToday | Published On Jun 12th, 2019

రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఏళ్ల తరబడి పలు శాఖల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి బూజును దులుపుతున్నారు. ఇప్పటికే ఆర్థిక, ఐటీ శాఖల్లో 12 మంది అవినీతి అధికారులపై వేటువేసిన మోదీ సర్కార్.. మిగతా శాఖల్లో అక్రమాలపైనా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. దీంతో రాజకీయ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓవైపు అవినీతిని ప్రక్షాళన చేస్తూనే.. మరోవైపు పాలనను కూడా పరుగులు పెట్టిస్తున్నారు మోదీ. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు దిశానిర్దేశం చేశారు.

ఆర్థిక రంగంలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న మోదీ సర్కారు.. ఈసారి బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల విలీనాన్ని వేగవంతం చేయడంతో పాటు.. నల్లధనాన్ని తగ్గించేందుకు, డిజిటల్ పేమెంట్లను పెంచేందుకు పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ప్రజాభిప్రాయ సేకరణకు పెద్దపీట వేసిన మోదీ సర్కార్.. కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.

ఓవైపు రోజురోజుకీ పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ఉగ్రముప్పు నేపథ్యంలో.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. గత జనవరిలో చివరిసారిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మోదీ సర్కార్.. రక్షణ రంగానికి పెద్దయెత్తున నిధులు కేటాయించింది. ఇక రాఫెల్ వంటి అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రోదిచేసుకుంటున్న భారత్.. ఈసారి కూడా డిఫెన్స్ కు భారీగా కేటాయింపులు చేసే అవకాశం ఉంది.

అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన మోదీ:
పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కఠిన నిర్ణయాలతో గత ఐదేళ్లలో కీలక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మోదీ.. ఓవైపు నల్లధనంపై ఉక్కుపాదం మోపుతూనే.. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఇక భారతీయుల ఆశీస్సులతో మరోసారి ఢిల్లీ పీఠం అధిరోహించిన మోదీ.. అప్పుడే అవినీతిపై కూకటివేళ్లతో పెకిలించడానికి సిద్ధమయ్యారు. అవినీతిరహిత పాలన అందిస్తామని మొదటి నుంచీ చెబుతూ వస్తున్న మోదీ.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని శాఖల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు మోదీ.