Saturday, October 19, 2019
Follow Us on :

అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రాంతమిది..!

By BhaaratToday | Published On Mar 1st, 2019

ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ రైల్వే మైదానంలో నిర్వహించిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ప్రధాని మాట్లాడారు. మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రాంతమిది. తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిథ్యం వహించిన నగరమిది. పారిశ్రామికంగా, పర్యాటకంగా దేశాభివృద్ధిలో విశాఖది ప్రధాన పాత్ర’ అంటూ మోడీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇక కోట్ల మంది యువత ఆకాంక్షలు నెరవేర్చే నగరం విశాఖ అని మోడీ అన్నారు. దశాబ్దాలనాటి విశాఖ రైల్వే జోన్‌ కలను సాకారం చేశామని చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ బాగా అభివృద్ధి చెందుతుందని.. దీంతో ఈ ప్రాంతం ఎంతో ప్రగతి సాధిస్తుందన్నారు. విశాఖ నగరాన్ని చూసి తన మనసు పులకిస్తోందని ప్రధాని చెప్పారు. సింహాచలం నారసింహుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని ప్రజలను ఉద్దేశించి అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత విస్తరిస్తున్నామని.. అనేక కార్యక్రమాల ద్వారా నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మారుస్తున్నామని మోడీ వివరించారు. ఐఐఎం, పెట్రోలియం కాంప్లెక్స్‌, లాజిస్టిక్స్‌ హబ్‌ తీసుకొచ్చామన్నారు. విశాఖ రిఫైనరీ ఆధునీకీకరణ పనులు చేపట్టామని ఆయన చెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే అవినీతి నేతల ఆటలు సాగవని మోడీ అన్నారు. తమదంతా పారదర్శక పాలన అని.. అందుకే తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. 
‘‘ఇక్కడి నేతలు ప్రతిసారీ యూ టర్న్‌ తీసుకుంటున్నారు. ఈ నేతలు రాష్ట్రాభివృద్ధికి ఏం చేస్తున్నారు? అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే నన్ను తిడుతున్నారు. ఇక్కడి నేతలు ఎలాంటి వారితో కూటమి కట్టారో ప్రజలు గ్రహించాలి. పలుసార్లు మాట మార్చే నేతల వైఖరిని గమనించాలి. కూటమి కట్టిన నేతలకు ఎలాంటి అజెండా లేదు. నల్లధనం దాచుకున్న వారిపై చర్యలు తీసుకోవడమే వీరి బాధకు కారణం. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుంది. భావసారూప్యత లేని పార్టీలన్నీ కూటమి కట్టాయి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. బలమైన ప్రభుత్వంతోనే రైతులు, జవాన్లు బాగుంటారు’’ అని మోడీ అన్నారు.