Tuesday, May 21, 2019
Follow Us on :

ఎంత దుర్మార్గుడైనా.. చంద్రబాబు మరణించాలని తాను కోరుకోవడం లేదు

By BhaaratToday | Published On Apr 1st, 2019

నటుడు మోహన్ బాబు చంద్రబాబు నాయుడు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంత దుర్మార్గుడైనా, చంద్రబాబు మరణించాలని తాను కోరుకోవడం లేదని, ఆయన నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని మోహన్ బాబు చెప్పారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నిత్యమూ జగన్ ను దొంగ, దొంగ అని ఆరోపించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుపై 11 కేసులు ఉన్నాయని, వాటిల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకుని తిరుగుతున్నారని మోహన్ బాబు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎవరిని మోసం చేసి ఇంత ఆస్తి సంపాదించారని మోహన్ బాబు ప్రశ్నించారు.


చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఏ మాత్రం లేదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అబద్ధాలు, మోసాలు చెప్పే వ్యక్తిని ఎన్నుకోరాదని ప్రజలను కోరారు మోహన్ బాబు. 3,600 కిలోమీటర్లకు పైగా నడిచిన ఏకైక రాజకీయ నాయకుడిగా ఉన్న జగన్, తానిచ్చిన నవరత్నాల హామీలను నిలబెట్టుకుంటాడన్న నమ్మకం తనకుందని అన్నారు. జగన్ నిక్కచ్చిగా ఉండే మనిషని, ఆయన సీఎం కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు. రాజధానిని ఏదైనా బీడు భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కట్టివుంటే ఎంతో మేలు జరిగుండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ముందే బినామీల ద్వారా భూములను కొనుగోలు చేయించి, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి రైతులను మోసం చేశారని మోహన్ బాబు అన్నారు.