Thursday, July 18, 2019
Follow Us on :

ఓపెనర్ గానే బ‌రిలోకి దిగుతా..!

By BhaaratToday | Published On Mar 20th, 2019

భారత్ జట్టుకి వ‌న్డేల్లో ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ.. ఐపీఎల్ ముంబయి ఇండియన్స్‌కి మాత్రం గత మూడు సీజన్ల నుంచి మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు. 2018 సీజన్‌లో రోహిత్ శర్మ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. కానీ.. ఐపీఎల్ 2019 సీజన్‌లో తాను మళ్లీ ఓపెనర్‌గా ఆడబోతున్నట్లు తాజాగా రోహిత్ శర్మ వెల్లడించాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే వేదికగా ముంబయి తన తొలి మ్యాచ్‌లో ఢీకొననుంది. 

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2019 సీజన్‌లో నేను ఆడే అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీ తర్వాత ప్రపంచకప్ జరగనుండటం కూడా దీనికి ఓ కారణం. అంతేకాకుండా.. నేను ఓపెనర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేయగలుగుతున్నా. ఈ విషయాన్ని ఇప్పటికే జట్టుతో చర్చించాను. వారు అర్థం చేసుకున్నారు. జట్టు మిడిలార్డర్‌లో అనుభమున్న ఆటగాళ్లు ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి.. ఫ్రాంఛైజీ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. 

2018 ఐపీఎల్ సీజన్‌లో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో కేవలం 286 పరుగులే చేసి నిరాశపరిచాడు. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో.. ఫామ్ అందుకోవాలని ఈ ఓపెనర్ ఆశిస్తున్నాడు. అందుకు.. మళ్లీ తనకి అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..!