Monday, September 23, 2019
Follow Us on :

మునాఫ్ పటేల్ ను కావాలనే ఇరికిస్తున్నారా..?

By BhaaratToday | Published On Sep 7th, 2019

మునాఫ్ పటేల్.. గుర్తున్నాడుగా..! ఈ ఫాస్ట్ బౌలర్ భారత్ తరపున 70 వన్డేలు, 13 టెస్టులు, 3 టీ20లు ఆడాడు. 2011లో భారత్‌ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మునాఫ్ ప్రస్తుతం బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ (బీసీఏ) క్రికెట్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే మునాఫ్ పటేల్ అనుకోని చిక్కుల్లో పడ్డారు. 

విదర్భ క్రికెట్‌ చీఫ్‌ దేవేంద్ర సుర్తి మునాఫ్‌ పటేల్ పై సంచలన ఆరోపణలు చేశారు. మునాఫ్ తనను చంపుతానంటూ బెదిరించినట్లు దేవేంద్ర సుర్తి నవపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడటాన్ని సహించలేక మునాఫ్‌ బెదిరింపులకు దిగాడని సుర్తి పేర్కొన్నారు. ఒకవేళ తనకు కానీ, కుటుంబానికి కానీ ఏమైనా ప్రమాదం వాటిల్లితే మునాఫ్‌నే పూర్తి బాధ్యడ్ని చేయాల్సి ఉంటుందని పోలీస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే మునాఫ్ మాత్రం తనను కావాలనే ఇరికిస్తున్నారని వాపోయాడు. తన పేరును కావాలనే తెరపైకి తీసుకొచ్చారని.. నాకు తెలిసినంత వరకూ క్రికెట్‌ ఆడటమే తెలుసునన్నాడు మునాఫ్. సుర్తికి సెలక్షన్‌ కమిటీ సభ్యులతో ఇబ్బందులున్నాయి. నాకు సెలక్షన్స్‌తో ఎటువంటి  సంబంధం ఉండదని చెప్పుకొచ్చాడు. ఇది అనవసరమైన రాద్ధాంతం తప్ప నేను ఎవర్నీ చంపుతానని బెదిరించలేదని మునాఫ్‌ చెప్పుకొచ్చాడు. నిజంగానే వారి మధ్య గొడవలు జరిగాయా.. లేక మునాఫ్ పటేల్ ను కావాలనే ఇరికిస్తున్నారా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.