Saturday, October 19, 2019
Follow Us on :

ఎంత ఘోరం..! మాట్లాడటం లేదని మాటేసి నరికాడు..!!

By BhaaratToday | Published On Feb 6th, 2019

ఇంటర్‌ విద్యార్థినిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది భరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు మండల‌ డీసీపీ రమేష్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘విద్యార్థిని తనతో మాట్లాడటం లేదని భరత్‌ అనే యువకుడు  ఆమెను అటకాయించి కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు యశోదా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. నిందితుడు భరత్‌ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మూసీ నది ఒడ్డున పట్టుకున్నాం. దాడికి ఉపయోగించిన కత్తిని అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నాం. బాధితురాలి ఇంటికి 15 అడుగుల దూరంలోనే నిందితుడి ఇల్లు కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఇరుకైన గల్లీలు ఉండటంతో దాడి జరుగుతున్న సమయంలో స్థానికులు సకాలంలో స్పందించ లేకపోయారు. నెలక్రితం భరత్‌ ఆమెను వేధించడంతో ఇరు కుటుంబాల వారు వెల్ నెస్‌ సెంటర్‌కు వెళ్లారు. సామరస్యంగానే పిల్లలను దూరంగా ఉంచాలని అనుకున్నారు. గతంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనూ తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పిల్లల మధ్య స్నేహం విషయం అక్కడ ఎవరికీ తెలియకూడదనుకున్నారు. ఈ నేపథ్యంలో భరత్‌ కత్తితో దాడికి పాల్పడ్డాడు. భరత్‌కు గతంలో నేర చరిత్ర ఏమీ లేదు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. నిందితుడిపై హత్యాయత్నం, ఫోక్సో కింద కేసులు పెడతాం’’ అని డీసీపీ వెల్లడించారు. భరత్‌ను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.