Saturday, October 19, 2019
Follow Us on :

జాతర చూద్దాం రారండి..! నాగోబా వైభోగం..!!

By BhaaratToday | Published On Feb 5th, 2019

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంత కెస్లాపూర్ గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. ఆయాప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులు, భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. నాగోబాకు నిర్వహించే మహాపూజలకు ఉదయం 11 గంటల నుంచే శ్రీకారం చుట్టారు. పవిత్ర గంగాజలంతో మర్రిచెట్లవద్ద బసచేసిన మెస్రం వంశీయులు కెస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నాగోబా విగ్రహాన్ని ఆలయానికి తరలించారు. ముందుగా మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించారు. పురాతన నాగోబా విగ్రహాలతోపాటు సతీదేవతలకు, భాన్ దేవతలతోపాటు పెర్సపేన్‌దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలోని 22 కితలకు చెందిన మహిళలకు పెద్దల చేతులమీదుగా మట్టికుండలు పంపిణీ చేయగా, ఆడపడుచులు మర్రిచెట్ల ప్రాంతంలోని పురాతన బావి కోనేరుకు చేరుకున్నారు. మెస్రం వంశ అల్లుళ్లు మట్టికుండల్లో తోడిచ్చిన నీటిని ఆలయానికి తీసుకొచ్చారు. ఆ నీటితో అల్లుళ్లు బురదమట్టి తయారుచేయగా, అ మట్టితో పాముల పుట్టలు, బౌలదేవతలను తయారుచేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం మహిళలకు గోవాడ్‌లో ప్రవేశం కల్పించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. అనంతరం అతిథులతోపాటు భక్తజనానికి నాగోబా దర్శన అవకాశం కల్పించారు.