Saturday, December 14, 2019
Follow Us on :

పాకిస్థాన్ తొలి మహిళా వ్యోమగామి ఇస్రోపై పొగడ్తల వర్షం

By BhaaratToday | Published On Sep 9th, 2019

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి దశలో విఫలమవ్వడంతో ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్-2 ల్యాండింగ్ లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ ఆగిపోయింది. చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు ల్యాండర్ నుంచి ఆర్బిటర్, గ్రౌండ్ స్టేషన్స్ కు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడిపై స్థిరమైన కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ తో ల్యాండర్ జాడను ఇస్రో కనిపెట్టింది. హార్డ్-ల్యాండింగ్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ సేఫ్ గానే ఉందని ఇస్రో సీనియర్ అధికారులు తాజాగా వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్ ఇంకా ఒకే పీస్ లాగా ఉందని.. పెద్దగా డ్యామేజీ జరిగినట్లు తాము భావించడం లేదని అధికారులు చెబుతున్నారు. 

Image result for namira salim

పాకిస్థాన్ మంత్రులైతే భారత్ కు తగిన శాస్తి జరిగిందని.. ఎలా చేయాలో తెలీకుండా భారత్ బాగా నష్టపోయిందంటూ రాక్షసానందం పొందారు. అయితే పాకిస్థాన్ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీమ్ మాత్రం ఇస్రోపై పొగడ్తల వర్షం కురిపించింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ చరిత్రాత్మకమైనదని ఆమె అన్నారు.  చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు ఇస్రో చేసిన ప్రయత్నం అద్భుతమని కొనియాడారు. చంద్రయాన్-2 ప్రయోగం దక్షిణాసియా సాధించిన విజయమని చెప్పారు. ప్రపంచ అంతరిక్ష రంగమంతా ఈ ప్రయోగం పట్ల గర్వంగా ఉందని అన్నారు. అంతర్జాతీయ రంగంలో దక్షిణాసియా ప్రాంతంలోని ఏ దేశం ముందడుగు వేసినా... అది ఈ ప్రాంతమంతటికీ గర్వకారణమేనని చెప్పారు. కరాచీ కేేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న డిజిటల్ సైన్స్ మేగజీన్ 'సైంటియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇస్రో సాధిస్తున్న విజయాలపై పొగడ్తలు కురిపించారు. 

Image result for namira salim