Monday, November 18, 2019
Follow Us on :

జెర్సీ సినిమాలోని చాలా అంశాలు ఆయన జీవితం లోనివే

By BhaaratToday | Published On Apr 20th, 2019

ఎన్ని సినిమాలు విడుద‌లైనా కొన్ని సినిమాలు మాత్ర‌మే వాటి మార్కును చాటుతాయి. కొన్ని  మాత్ర‌మే కొంద‌రి జీవితాల‌ను పోల్చుకునేలా అభిమానుల మ‌న‌సుల‌ను తాకుతాయి. ఈ మ‌ధ్య‌నే రిలీజైన నేచుర‌ల్ స్టార్ నాని జ‌ర్సీ సినిమా ఆ కోవ‌లోకి చెందిన‌దే.

జెర్సీ రీల్ క‌థ‌ :
అర్జున్‌ (నాని) ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో ఆడాలని​ కలలు కంటూ ఉంటాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా చివరి క్షణాల్లో అవకాశం వచ్చి.. చేజారి పోతూ ఉంటుంది. అలా 26 ఏళ్ల వయసులో కెరీర్‌(క్రికెట్‌ లైఫ్‌) ను వదిలేస్తాడు. అప్పటికే తను ప్రేమించిన సారాను పెళ్లి చేసుకున్న అర్జున్‌..  ఓ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి సాధార‌ణ జీవితం గ‌డుపుతుంటాడు. అర్జున్‌, సారాలకు నాని అనే కుమారుడు పుడతాడు. కొంత కాలానికి అర్జున్ ఉద్యోగం పోతుంది. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఉంటాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ.. కనీసం కొడుకు పుట్టిన రోజున అడిగిన బహుమతి కూడా కొనివ్వలేని ప‌రిస్థితిలో ఉంటాడు. ఇలా అన్నింటిని భరిస్తూ ఉన్న అర్జున్‌.. కొడుక్కి తనో హీరోలా కనబడడానికి ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మొద‌లు పెట్టాల‌నుకుంటాడు. అసలు అర్జున్‌  క్రికెట్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది.. చివరకు అర్జున్‌ ఏమయ్యాడు? తాను అనుకున్నట్లు కొడుకు దృష్టిలో హీరోగా మిగిలిపోయాడా? లేదా అన్నదే జెర్సీ స్టోరీ.

రామ‌న్ రియ‌ల్ క‌థ‌ :
1960 జ‌న‌వ‌రి 2న‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్ లో జ‌న్మించిన రామ‌న్ లంబా చిన్న‌త‌నం నుండే క్రికెట్ పై మ‌క్కువ‌తో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకుంటాడు. ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించిన అవ‌కాశం త‌లుపుత‌ట్టి చివ‌రి నిమిషంలో చేజార‌డం జ‌రుగుతుండ‌టంతో.. 1980లో త‌న శ‌క్తినంతా కూడ‌గ‌ట్టి రంజీ జ‌ట్టులో స్థానం సంపాదిస్తాడు. రంజీల్లో అప్ర‌తిహ‌తంగా రాణిస్తున్న త‌న‌కు 1986 ఆసియా క‌ప్ రూపంలో అనుకోకుండా జాతీయ జ‌ట్టులోకి పిలుపురావ‌డం.. 11మంది ఉన్న తుది జ‌ట్టులో స్థానం దొర‌క‌క‌ 12వ ఆట‌గాడిగా కొన‌సాగ‌డం జ‌రుగుతుంది. ఈ ప‌రిణామాల నేఫ‌థ్యంలో  రామ‌న్ త‌న‌కు కాబోయే భార్య, ఐరిష్ సంత‌తికి చెందిన‌ కిమ్ మిచెల్ ను క‌లుసుకోవ‌డం జ‌రుగుతుంది. వీరిరువురు మూడు సంవ‌త్స‌రాలు స‌హ‌జీవ‌నం చేసిన అనంత‌రం ఒక్క‌ట‌వుతారు. ఈ క్ర‌మంలోనే జాస్మిన్, క‌మ్రాన్ అనే ఇద్ద‌రు సంతానం క‌లుగుతారు. అనంత‌రం జాతీయ జ‌ట్టులో స్థానం సంపాదించ‌డం, రాణించ‌డం జ‌రుగుతుంది. త‌ద‌నంత‌రం త‌ను పూర్తి స్థాయి ఓవ‌ర్సీస్ ప్రొపేష‌న‌ల్ క్రికెట‌ర్ గా మార‌డం.. బంగ్లాదేశ్ లో జ‌రుగుతున్న ఓ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా త‌ల‌కు తీవ్ర‌గాయ‌మై మైదానంలోనే కుప్ప‌కూలి చ‌నిపోవ‌డం జ‌రుగుతుంది.  

సారుప్య‌తలు :
సినిమాలో కెరియ‌ర్ కంటే ముందుగానే హీరోయిన్ ను క‌ల‌వ‌డం, పెళ్లి చేసుకోవ‌డం, పిల్ల‌లు.. ల‌క్ష్యం వెంట వెళ్తుంటే వ‌చ్చే ఒడిదుడుకులు, జ‌ట్టులో స్థానం ద‌క్క‌న‌ట్టే ద‌క్కి చివ‌రి నిమిషంలో చేజారిపోవ‌డం, ఆఖ‌రికి నిండు జీవితానికి మ‌ద్య‌లోనే ముగింపు ప‌డ‌టం అక్క‌డ‌క్క‌డ‌ రామ‌న్ లంబా జీవితం తాలుఖా చాయ‌లు క‌న‌ప‌డ‌టం జ‌రుగుతుంది.