Tuesday, October 15, 2019
Follow Us on :

కశ్మీరీ పండిట్లు సొంత ఇళ్ళను వదిలిపెట్టి పారిపోవడం భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయం:మోడీ

By BhaaratToday | Published On Feb 4th, 2019

జమ్ము, కశ్మీర్‌ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. లేహ్, విజయ్ పూర్ లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లేహ్ బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. ఈ రోజు తన చేతుల మీదుగా శంకుస్థాపనలు జరిగిన ప్రాజెక్టులకు, తన చేతుల మీదుగానే  ప్రారంభోత్సవం కూడా చేస్తానని వ్యాఖ్యానించారు. లడఖ్ స్వయంప్రతిపత్తి కొండ అభివృద్ధి మండలి చట్టానికి సవరణలు చేశామని..దీంతో కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న నిధులను ఈ కౌన్సిల్ విడుదల చేస్తుందని తెలిపారు.

కశ్మీరీ పండిట్ల సమస్యల పరిష్కరానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నరేంద్ర మోడీ. విజయ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోడీ.. కశ్మీరీ పండిట్ల ఆత్మాభిమానం గౌరవం హక్కుల అమలుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. హింస ఉగ్రవాదం చెలరేగిన కాలంలో కశ్మీరీ పండిట్లు తమ స్వంత ఇళ్ళను వదిలిపెట్టి పారిపోవలసి వచ్చిందని ఇది భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయమని అభిప్రాయపడ్డారు.

దేశాన్ని దశాబ్ధాల పాటు పరిపాలించిన కాంగ్రెస్.. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి విషయంలో తీవ్ర నిరక్ష్యం చేసిందని విమర్శించారు ప్రధాని మోడీ. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. బీజేపీ పాలనలో అభివృద్ధి ఇలాగే కొనసాగుతుందని అన్నారు. 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధించి.. మరోసారి తానే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.