Saturday, October 19, 2019
Follow Us on :

విదేశాల్లో మోదీ.. ఫోన్ చేసిన అరుణ్ జైట్లీ కుటుంబం..!

By BhaaratToday | Published On Aug 24th, 2019

అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని ఆయన నివాసంలో అందరి సందర్శనార్థం ఉంచారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. రేపు మధ్యాహ్నం జైట్లీ అంత్యక్రియలు జరగనున్నాయి.

 అరుణ్ జైట్లీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా జైట్లీతో తనకు పరిచయం ఉండటాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. సమస్యలపై ఆయనకు ఉన్న దూరదృష్టి, వివిధ అంశాలపై ఆయనకు ఉన్న పట్టు అమోఘమని కొనియాడారు. విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని, ఎన్నో మధుర స్మృతులను మిగిల్చి, వెళ్లిపోయారని అన్నారు. 'వీ మిస్ హిమ్' అని ట్వీట్ చేశారు. బీజేపీ-అరుణ్ జైట్లీలది విడదీయలేని అనుబంధమని మోదీ చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థి నాయకుడిగా జైట్లీ పోరాడారని అన్నారు. బీజేపీలో అందరి అభిమానాన్ని చూరగొన్న గొప్ప నేత అని ప్రశంసించారు. భారత్ కు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జైట్లీ మన మధ్య లేని లోటు పూడ్చలేనిదని అన్నారు మోదీ. 

అరుణ్ జైట్లీ  కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం అబూదాబిలో ఉన్న మోదీ జైట్లీ భార్య, కుమారుడికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మూడు దేశాల పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని రావద్దని ఈ సందర్భంగా వారు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం టూర్ ను ముగించుకుని రావాలని కోరారు.