Tuesday, October 15, 2019
Follow Us on :

సైన్స్‌లో ఫెయిల్యూర్‌ అనే మాటే లేదు.. ఆయన మాటలే కొండంత ధైర్యం

By BhaaratToday | Published On Sep 7th, 2019

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి దశలో విఫలమవ్వడంతో ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోదీ దగ్గరకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. శివన్ ను మోదీ దగ్గరకు తీసుకుని, గాఢంగా హత్తుకున్నారు. తన భుజంపై శివన్ తల ఉంచుకుని, ఆయన వీపును నిమురుతూ, ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఇస్రో సాధించబోయే ఘన విజయాలకు ఇది బలమైన నాంది పలుకుతుందని చెప్పారు. 

అంతకు ముందు మోదీ ప్రసంగిస్తూ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. భారతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. వారి కుటుంబాలకు తమ సెల్యూట్‌ తెలియజేస్తున్నానని మోదీ అన్నారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి శాస్త్రవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. శాస్త్రవేత్తల బాధను తానూ పంచుకుంటున్నానని.. దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న నిబద్ధత ఎంతో గర్వించదగిందన్నారు. చంద్రుడికి మనం దగ్గరగా వెళ్లామని.. భవిష్యత్‌లో మనం మరిన్ని ప్రయోగాలు చేయాలన్నారు. అయితే ఇదెంత మాత్రం వెనుకడుగు కానే కాదని.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గర్వపడుతున్నామని, శాస్త్రేవేత్తలు ఏ మాత్రం అదైర్య పడవద్దని అన్నారు. మీరు సంతోషించే మరెన్నో అవకాశాలు మున్ముందు వస్తాయన్నారు. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు… మనల్ని మరింత ధృఢంగా తీర్చిదిద్దుతాయన్నారు. సైన్స్‌లో ఫెయిల్యూర్‌ అనే మాటే లేదని, మన విజయాలకు భారీ కొలమానాలు పెట్టుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.