Tuesday, October 15, 2019
Follow Us on :

హ్యూస్టన్ సాక్షిగా పాక్ కు వార్నింగ్ ఇచ్చిన మోదీ..!

By BhaaratToday | Published On Sep 23rd, 2019

అమెరికాలోని హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ-మోదీ’ సభలో పాకిస్థాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370కి చరమగీతం పాడి కాశ్మీర్ ప్రజలకు ఎంతో మంచి చేసిందని.. రాజ్య సభలో తమకు మెజారిటీ లేకున్నా కూడా ఇతర పార్టీ నేతలు కూడా తమకు మద్దతు పలికారంటే తాము ఎంత మంచి పనిచేస్తున్నామో అందరికీ అర్థం అయ్యే ఉంటుందని ఆయన అన్నారు. తాము కాశ్మీర్ ప్రజల సమస్యలను తీర్చాలని అనుకుంటే ఓ దేశం మాత్రం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని.. ఆ దేశం ఏదో ప్రతి ఒక్కరికీ తెలుసునని పాకిస్థాన్ ను ఇన్ డైరెక్ట్ గా ఇరుకున పెట్టేశారు మోదీ..! ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని.. రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కాశ్మీర్ ప్రజలకు వర్తిస్తాయన్నారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యకు ముగింపు పలికామన్నారు.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరో ప్రపంచానికి తెలుసన్నారు.  అమెరికాలో 9/11 ఘటన.. భారత్‌లో 26/11 ఘటనలు జరిగినప్పుడు ఈ దాడులకు మూలాలు ఎక్కడ ఉన్నాయో.. కుట్రలు ఎక్కడ జరిగాయో అందరికీ తెలుసని పాకిస్థాన్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు మోదీ. ఇకపై వీటిని ఉపేక్షించేదే లేదని మోదీ చెప్పుకొచ్చారు. భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తుంటే కొందరు చూడలేకపోతున్నారని అన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ట్రంప్ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. అమెరికా, భారత్ ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని తరిమికొడతామన్నారు.