Wednesday, October 16, 2019
Follow Us on :

పర్యటన ముగిసి.. భారత్ కు చేరుకోగానే వారి ఇంటికి వెళ్లిన మోదీ

By BhaaratToday | Published On Aug 27th, 2019

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుల్లో అరుణ్ జైట్లీ కూడా ఒకరు. ఆయన మరణించిన సమయంలో మోదీ విదేశాల్లో ఉన్నారు. ఆ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు నరేంద్ర మోదీ. రాజధానికి చేరుకున్న గంటల వ్యవధిలోనే ఈ ఉదయం ఆయన దివంగత అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లారు. జైట్లీ కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు.

అరుణ్ జైట్లీ మరణించారని తెలిసిన సమయంలో మోదీ విదేశాల్లో ఉన్నారు. అప్పుడు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు మోదీ. విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని రావద్దని, పర్యటనను పూర్తి చేయాలని ఆ సందర్భంగా మోదీని జైట్లీ కుటుంబసభ్యులు కోరారు.

అరుణ్ జైట్లీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా జైట్లీతో తనకు పరిచయం ఉండటాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. సమస్యలపై ఆయనకు ఉన్న దూరదృష్టి, వివిధ అంశాలపై ఆయనకు ఉన్న పట్టు అమోఘమని కొనియాడారు. విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని, ఎన్నో మధుర స్మృతులను మిగిల్చి, వెళ్లిపోయారని అన్నారు. 'వీ మిస్ హిమ్' అని ట్వీట్ చేశారు. బీజేపీ-అరుణ్ జైట్లీలది విడదీయలేని అనుబంధమని మోదీ చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థి నాయకుడిగా జైట్లీ పోరాడారని అన్నారు. బీజేపీలో అందరి అభిమానాన్ని చూరగొన్న గొప్ప నేత అని ప్రశంసించారు.