Wednesday, October 16, 2019
Follow Us on :

ఇస్రోకు హెల్ప్ చేయనున్న నాసా.. విక్రమ్ ల్యాండర్ స్పందించేనా..!

By BhaaratToday | Published On Sep 12th, 2019

చంద్రయాన్-2 ల్యాండింగ్ లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ ఆగిపోయింది. చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు ల్యాండర్ నుంచి ఆర్బిటర్, గ్రౌండ్ స్టేషన్స్ కు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడిపై స్థిరమైన కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ తో ల్యాండర్ జాడను ఇస్రో కనిపెట్టింది. హార్డ్-ల్యాండింగ్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ సేఫ్ గానే ఉందని ఇస్రో సీనియర్ అధికారులు తాజాగా వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్ ఇంకా ఒకే పీస్ లాగా ఉందని.. పెద్దగా డ్యామేజీ జరిగినట్లు తాము భావించడం లేదని అధికారులు చెబుతున్నారు.
 
అయితే ఇప్పుడు ఇస్రోకు నాసా సహాయం అందించనుంది. విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ తెచ్చేందుకు నాసా తన టెక్నాలజీని వాడుతోంది. కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (జేపీఎల్) తమ డీప్ స్పేస్ నెట్ వర్క్ కేంద్రాల నుంచి విక్రమ్ ల్యాండర్ కు శక్తిమంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను పంపిస్తోంది. 24 బీమ్స్ 12 కిలోవాట్ల శక్తితో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీని చంద్రుడి ఉపరితలంపైకి పంపగా, అది తిరిగి భూమిని చేరిందని నాసా తెలిపింది. 

విక్రమ్ ల్యాండర్ జీవితకాలం కేవలం 14 రోజులు మాత్రమే. ల్యాండర్ ను సూర్యకిరణాలు కొన్నిరోజుల పాటు మాత్రమే తాకుతాయి. ఈ లోపే విక్రమ్ ల్యాండర్ సోలార్ ప్యానెళ్లను రీఛార్జ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.