Tuesday, October 15, 2019
Follow Us on :

బడ్జెట్ లో ఎవరెవరికి ఎంతెంత..?

By BhaaratToday | Published On Feb 1st, 2019

దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈసారి బడ్జెట్ ను ఓ చార్టెట్ అకౌంటెంట్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం ప్రవేశపెట్టిన చిట్టచివరి బడ్జెట్ ఇదే కావడంతో దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి, చార్టెట్ అకౌంటెంట్ అయిన పియూష్ గోయల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్నికల నేపథ్యంలో.. రైతులు, మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులు, మహిళలు తదితర వర్గాలకు పలు ఆకర్షణీయ పథకాలు ప్రకటించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ మాట్లాడిన పియూష్ గోయల్.. ప్రధాని మోడీ సారథ్యంలో ద్రవ్యలోటు 6 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గిందని చెప్పారు. గత ఐదేళ్లలో వేల కోట్ల రూపాయల ఎఫ్‌డీఐలను తీసుకురాగలిగామన్నారు. పబ్లిక్ సెక్టార్‌లో బ్యాంకుల బలోపేతానికి, పారదర్శక బ్యాంకింగ్‌కు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల రుణ బకాయిలను వసూలు చేశామని అన్నారు. మరోవైపు... కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్... రైతులు, ఉద్యోగులు, కార్మీకులు, మధ్యతరగతి, రక్షణ రంగాలపై వరాల జల్లు కురిపించింది. చిన్న, సన్న కారు రైతులకు కనీస పెట్టుబడి సాయం, మధ్యతరగతి ప్రజల కోసం ఆదాయపు పన్ను పరిమితి పెంపు, ఉద్యోగుల గ్యాడ్యూటీ పెంపుదలతో బడ్జెట్ ఆకట్టుకుంది. 
అటు.. ప్రధాన మంత్రి శ్రమ్‌ యోజన కింద అసంఘటిత కార్మీకులకు 3 వేల రూపాయల పింఛన్ అందిస్తామని ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇందుకోసం కార్మీకులు నెలకు వంద రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఈ పథకం కింద ఐదేళ్లలో 10కోట్ల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది మోడీ సర్కార్. రక్షణ బలగాలకు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది. అవసరమైతే మరింత సహాయం అందిస్తామని తెలిపింది. అంతే కాకుండా... సైనిక దళాల వేతనాలను పెంచింది. దీంతో పాటు వన్‌ ర్యాంక్‌ వన్‌ పింఛన్‌కు 35 వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఇక ఈశాన్య భారత దేశానికి ఈ మధ్యంతర బడ్టెట్ లో 58 వేల 166 కోట్ల రూపాయలను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 21 శాతం అదనం. అటు... మారుమూల ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణానికి బడ్జెట్ లో 19 వేల కోట్లు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధిను 62 వేల 574 కోట్ల రూపాయల నుంచి 76 వేల 800 కోట్లకు పెంపు చేసింది. మరోవైపు... భారతీయ సినీ నిర్మాణ సంస్థలకు సింగిల్‌ విండో క్లియరెన్స్‌ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 
ఇక 5 కోట్ల రూపాయల కంటే తక్కువ టర్నోవర్‌ ఉన్న పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపారస్తులు మూడు నెలలకోసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయవచ్చునని పియూష్ గోయల్ తెలిపారు. అటు.. వచ్చే ఐదేళ్లలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. వచ్చే ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... ఈసారి బడ్జెట్ లో గో సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా నిధులు కేటాయించింది మోడీ సర్కార్. గోవుల సంరక్షణార్థం గోకుల్‌ మిషన్‌‌కు 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు చేస్తామని పియూష్ గోయల్ తెలిపారు. దీంతో పాటు పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమకు చెందిన రైతులు తీసుకొన్న కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు  గోయల్ ప్రకటించారు. మొత్తమ్మీద ఎన్నికల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఉందని ఆర్థిక నిపుణులు కితాబిస్తున్నారు.