Saturday, October 19, 2019
Follow Us on :

అన్నదాతకు కేంద్రం అభయం..! బడ్జెట్ లో భారీ కేటాయింపులు..!!

By BhaaratToday | Published On Feb 1st, 2019

దేశానికి రైతే వెన్నెముక... పల్లెలే పట్టుకొమ్మలు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం.. దానికి తోడు వర్షాభావ పరిస్థితుల వల్ల అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కర్షకులకు బాసటగా నిలిచింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ఆరు వేల రూపాయలు జమ చేసేందుకు సన్నద్ధమైంది. మరోవైపు... కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధుతో పోలుస్తున్నారు కొంతమంది. కేసీఆర్ సర్కార్ రూపకల్పన చేసిన రైతు బంధు పథకమే కేంద్రం అనుసరిస్తోందని అంటున్నారు. అయితే... ఈ రెండు పథకాల తీరుతెన్నులు ఒకటేనా...? ఏది రైతన్నలకు నిజమైన భరోసా పథకం...? సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో... కష్టాల కడలిలో ఉన్న కర్షకులకు ఫలసాయాన్ని అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి 75 వేల కోట్ల రూపాయల నిధిని కేటాయించింది.  ఇక ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఎకరానికి ఆరు వేల రూపాయలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. 2018 డిసెంబర్ 1 నుంచే ఈ పథకం వర్తిస్తుందని... రెండు వేల రూపాయల చొప్పున నాలుగు దఫాలుగా అందిస్తామని తెలిపారు. 5 ఎకరాల పంట పొలం ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు. 
అటు.. ఈ పథకం ద్వారా దేశంలోని సుమారు 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతు బంధు పేరిట తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మాతృక రైతు బంధు అని పలువురు అంటున్నారు. అంతేకాదు.. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు దేశవ్యాప్తంగా ఆదర్శమని కితాబిస్తున్నారు. అయితే ఈ రెండింటికీ ఎంతో బేధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా... తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి కేంద్రం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ పథకాన్ని తెడా ఉందని నిపుణులు అంటున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి షరతులు లేవు. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అందరూ అర్హులే. ఈ విధానం వల్లే చిన్న, సన్నకారు రైతులకంటే బోతుబరి రైతులకే ఎక్కువ మేలు చేసే విధంగా ఉందని చాలా మంది అభిప్రాయం. కానీ.. మోడీ ప్రభుత్వం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ పథకం అసలైన చిన్న, సన్నకారు రైతులకు బాసటగా నిలుస్తుందని... అందువల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. మరోవైపు... ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలియా స్కీం పేరిట రైతు కుటుంబాలకు వార్షికంగా పది వేల రూపాయల చొప్పున జమ చేస్తోంది. అయితే... ఈ పథకానికి కూడా ఎంత పొలం... ఎవరెవరు హక్కుదారులు.. అన్న అంశాల జోలికి పోకుండా అన్నదాత ఖాతల్లో డబ్బును జమ చేస్తోంది. మొత్తమ్మీద... కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అసలైన నిరుపేద రైతులకు మేలు చేకూరుస్తుందని... రైతన్నలకు బాసటగా నిలుస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.