Friday, July 19, 2019
Follow Us on :

మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు

By BhaaratToday | Published On Apr 25th, 2019

తెలంగాణ ఇంటర్ బోర్డు ఈరోజు ఉదయం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ బోర్డు చేసిన తప్పులపై బుధవారం సమీక్ష జరిపిన తెలంగాణ సీఎం, ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ను ఉచితంగా చేయాలని ఆదేశించారు. ఈ ఉదయం ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఉత్తీర్ణత సాధించని వారు దరఖాస్తు చేసుకోకున్నా కూడా అందరికీ రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నగదును తిరిగి చెల్లించనున్నారు. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం ఇంటర్‌ నెట్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని తెలిపింది ఇంటర్ బోర్డ్. మే 15 లోపు కొత్త ఫలితాలను, కొత్త మార్కుల మెమోలను విద్యార్థుల ఇంటికి పంపుతామని తెలిపింది. 

ఇంటర్‌ బోర్డుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నందున ఈ సమావేశంలో కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ చేయాలని ఇంటర్‌బోర్డును ఆదేశించారు. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ త్వరగా పూర్తి చేయాలన్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష తప్పితే జీవితం ఆగిపోదని.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతను విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి సీఎం అప్పగించారు. పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాల్ని ఖరారు చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు.