Sunday, August 25, 2019
Follow Us on :

ఆమె బ్యాంగిల్.. ఎవడైనా టచ్ చేస్తే షాకే

By BhaaratToday | Published On Jul 15th, 2019

ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు..పసిపాప నుంచి పండు ముదుసలి వరకు నారీమణులకు రక్షణ లేకుండా పోతోంది. దారుణ కృత్యం జరిగాక..కేసులు, దర్యాప్తులు, నేరస్థుల అన్వేషణ, శిక్షలు.  ఈ తతంగం అంతా అవసరం లేకుండా..అసలు నేరం జరగకుండా..ప్రథమ స్థాయిలోనే నేరాన్ని తుంచివేసేలా..ఇద్దరు యువకులు ఓ పరికరాన్ని తయారు చేశారు. అదే సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్. ఈ పరికరాన్ని హరీష్, సాయితేజ్ అనే యువకులు రూపొందించారు. 

దుర్యోధన, దుశ్శాసన దుర్వినీతి లోకంలో...అని అమాయక అభాగ్యురాలి ఆవేదనను వర్ణించాడు సినీ కవి. అయితే, వాస్తవ జీవితంలో సైతం ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. వుమెన్ ఎంపవర్ మెంట్ మాట ఎలా వున్నా, మహిళా రక్షణే కరువైపోతోంది. లైంగిక వేధింపులు, ఆకతాయి చేష్టలు,  అకృత్యాలు, సూటిపోటి మాటలు..ఇలా అన్నివిధాలా నారీలోకం ఇక్కట్లను ఎదుర్కొంటోంది.  అమ్మాయిలపై చోటుచేసుకుంటున్న ఘటనలపై ఇద్దరు స్నేహితులు చలించిపోయారు. తమ వంతు సాయంగా సమాజానికి సేవ చేయాలని, అమాయక మహిళలపై జరిగే దాడులకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. బాలికలు, యువతులు తమను తాము రక్షించుకునే విధంగా ఒక పరికరాన్ని తయారు చేశారు

మొన్న బర్కత్ పుర, నిన్నచైతన్యపురి, నేడు ఇంకో ప్రాంతం...ఇలా ఎందరో అమ్మాయిలపై జరుగుతున్న దారుణ కృత్యాలకు అడ్డుకట్ట వేయాలని హరీష్, సాయితేజ్ ఓ వినూత్న పరికరాన్ని తయారు చేశారు.  అమ్మాయి దగ్గరకు వచ్చి ఎవరైనా ఆకతాయి వేధింపులకు పాల్పడితే ఆమె ధరించిన బ్యాంగిల్ ద్వారా ఆకతాయికి కరెంట్ షాక్ తగిలేలా పరికరాన్ని డిజైన్ చేశారు. యువతి  తల్లిదండ్రులు, ఆమెకు సంబంధించిన బంధువులకు, పోలీసులకు మెసేజ్ రూపంలో సమాచారం అందించడానికి ఈ పరికరం దోహదపడుతుంది.  అదేవిధంగా ఆ యువతి వున్న లొకేషన్ సైతం షేర్ చేస్తుంది. ఈ పరికరం పేరే సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్.

ప్రతి మహిళ బ్యాంగిల్ ధరించడం సహజమే. అయితే, సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్  ధరిస్తే...ఇక అపాయానికే తావు ఉండదని ఈ ఇద్దరు మిత్రులు తెలియచేస్తున్నారు.  దీనిని సామాన్యులకు సైతం అందుబాటులోకి ఉండేలా తయారు చేస్తున్నామని, అతి స్వల్ప ధరకు దీనిని అందజేస్తామని హరీష్, సాయితేజ్ మిత్రద్వయం తెలిపింది. . సర్కారు తమకు సహాయ సహకారాలు అందిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని ఈ స్నేహితులు అంటున్నారు. 

రాష్ట్రంలో మట్టిలో మాణిక్యాలు ఎందరో వున్నారు. టాలెంట్ వున్నా ఆర్థిక కష్టాల వల్ల తమ సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఈ యువ మేధావులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.