Saturday, October 19, 2019
Follow Us on :

సింగిల్ విండో ఛైర్మన్ నుంచి అసెంబ్లీ స్పీకర్ వ‌ర‌కు...

By BhaaratToday | Published On Jan 19th, 2019

» 1976లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పోచారం
» చంద్రబాబు హయాంలో మంత్రిగా బాధ్యతల నిర్వహణ
» పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు
» బాన్సువాడ నుంచి ఆరుసార్లు విజయం సాధించిన శ్రీనివాస్‌ రెడ్డి
» సీనియర్ శాసనసభ్యుడిగా గుర్తింపు

తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. విపక్షాలన్నీ సహకరించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మంత్రిగా సేవలందించిన ఈయన...ఇప్పుడు అటు ప్రభుత్వానికి.. ఇటు విపక్ష సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే ఆయన స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభలో సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆహ్వానం మేరకు.. ఏకగ్రీవంగా స్పీకర్ పదవికి ఎంపిక పోచారం సభాపతి పీఠంపై ఆశీనులయ్యారు. సింగిల్ విండో ఛైర్మన్ పదవి నుంచి తాజాగా అసెంబ్లీ స్పీకర్ పదవి దాకా పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ జీవితం ఆదర్శనీయంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవిని త్యజించి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన పోచారం.. ఉద్యమకాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

1949, ఫిబ్రవరి 10న పరిగె రాజిరెడ్డి, పాపమ్మ దంపతులకు జన్మించిన శ్రీనివాస్‌రెడ్డి.. ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం కావడంతో.. రాజకీయంగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఎవరి ఆశీస్సులు లేవు. స్వయంకృషితో రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. 

బాన్సువాడ నుంచి ఏడుసార్లు పోటీ చేసి, ఆరుసార్లు విజయం సాధించిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. రాష్ట్రంలోనే సీనియర్ శాసనసభ్యుడిగా గుర్తింపు పొందారు. సమైక్య రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఉంది. టీడీపీ నేతగా చంద్రబాబు హయాంలో మంత్రి పదవి నిర్వహించారు. రాజకీయ అనుభవంలో అందరి కంటే సీనియర్ నాయకుడైన పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 

1976లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పోచారం వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తొలినాళ్లలో టీడీపీ నేతగా ప్రజాద‌ర‌ణ‌ పొందారు. 1984 నుంచి 2011 వరకు దాదాపు 27 సంవత్సరాల పాటు టీడీపీలో కొనసాగారు. జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఆ పార్టీకి సేవలందించారు. అయితే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ కు చేరుకోవడంతో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు పొలిట్ బ్యూరో సభ్యుడిగా అవకాశం దక్కింది. 

1987లో డీసీసీబీ ఛైర్మన్ గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి... 1994లో బాన్సువాడ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రి ప‌ద‌వులు కూడా చేప‌ట్టారు. అలా సుదీర్ఘంగా సాగిన పోచారం ప్రస్థానంలో ఇప్పుడు స్పీకర్ పదవి వరించింది.