Monday, August 19, 2019
Follow Us on :

ఫైనల్ మ్యాచ్ ఫలితంపై తెర‌పైకి కొత్త‌ వాదన!

By BhaaratToday | Published On Jul 16th, 2019

ప్ర‌పంచ‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై కొత్త‌ వాదన తెరపైకొచ్చింది. బౌండరీ రూల్ వల్లే న్యూజిలాండ్ జట్టు ఓడిందని.. క్రీడా ప్రపంచం నుంచి సానుభూతి వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ కోచ్ వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వరల్డ్ కప్ ఫైనల్ డ్రాగా ముగిసిందని.. అందువల్ల వరల్డ్ కప్‌ను ఇరు జట్లు షేర్ చేసుకుని.. రెండు జట్లను విజేతలుగా ప్రకటించి ఉంటే బాగుండేదని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ సంధ‌ర్భంగా.. ప్రకటించిన ఫలితాన్ని ఐసీసీ మరోసారి సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. రెండు జట్లు నిర్ణీత ఓవర్లలో సమాన పరుగులు చేసినా ఇంగ్లండ్‌నే విజేతగా ప్రకటించడంతో ఏదో వెలితిగా ఉంద‌నే భావన కలిగిందని గ్యారీ అన్నారు. గుప్తిల్ వికెట్లకు విసిరిన బంతి బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీ లైన్‌కు వెళ్లడం, అంపైర్ ఆరు పరుగులు ప్రకటించడంపై.. రూల్స్ ప్రకారం ఐదు పరుగులు మాత్రమే ప్రకటించాల్సి ఉందని.. ఈ విషయంలో అంపైర్ తప్పిదం స్పష్టంగా కనిపించిందని స్టీడ్ అన్నారు. అంపైర్లు కూడా మనుషులేనని, కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదాలు సహజమేనని స్టీడ్ తెలిపారు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా దేన్నీ మార్చలేమని త‌న నిస్సహాయత వ్యక్తం చేశాడు.