Monday, November 18, 2019
Follow Us on :

నీరవ్ కు బెయిల్ ఇవ్వని లండన్ కోర్టు.. అప్పగింత కోసం భారత్ పట్టు.. ఇంతలో ‘దొంగ’ నాటకం..!

By BhaaratToday | Published On Nov 8th, 2019

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 14 వేల రూపాలయలు టోకరా వేసి.. లండన్ చెక్కేసిన వజ్రాల దొంగ నీరవ్ మోదీకి.. యూకే కోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే నాలుగుసార్లు నీరవ్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన లండన్ లోని వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం.. తాజాగా ఐదోసారి కూడా తిరస్కరించింది. తనను భారత్ అప్పగించడంపై సవాల్ చేస్తూ నీరవ్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. దీంతో అతన్ని భారత్ కు రప్పించడానికి మార్గం సుగమమైంది. 

భారత్‌ లో ప్రభుత్వ రంగ బ్యాంకులను.. ప్రత్యేకించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను లూటీ చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ ఆర్థిక నేరగాడు త్వరలోనే భారత్ లో కటకటాలు లెక్కించే సమయం దగ్గరపడుతోంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐదోసారి నీరవ్ మోదీ పెట్టుకున్న పిటిషన్ ను లండన్ కోర్టు కొట్టివేసింది.

లండన్ జైల్లో వున్న భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తన ఎత్తులు పారపోయేసరికి బెదిరింపులకు దిగాడు. భారత్ కు పంపిస్తే చచ్చిపోతానంటూ దొంగ నాటకానికి తెరతీసాడు. అయినా, వెనక్కి తగ్గని లండన్ కోర్టు.. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. బ్యాంకులకు టోకరా వేసి లండన్‌కు పారిపోయిన నీరవ్ మోదీని.. లండన్ నుంచి భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో కొన్ని దౌత్యపరమైన అంశాలు అడ్డుగా ఉండటంతో ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే జైలులో ఉన్న నీరవ్ మోదీ, బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే యూకే కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేయడం లేదు. ఇక తాజాగా మరో బెయిల్ పిటిషన్ వెస్ట్‌మిన్స్‌టర్ కోర్టులో వేశాడు. అయితే, బెయిల్ దొరుకుతుందని ఆశించిన నీరవ్ కు మరోసారి చుక్కెదురైంది. 

లండన్‌లో పోలీసులు అరెస్టు చేయగా అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. ఇక నీరవ్ మోదీ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ కీత్.. తన క్లయింట్ నీరవ్ మోదీని ఇతర ఖైదీలు రెండు సార్లు కొట్టారని చెప్పారు. వాండ్స్‌వర్త్ జైలులో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒకసారి.. తాజాగా మరోసారి కూడా నీరవ్ మోదీని కొట్టారని చెప్పారు. ముంగళవారం రోజున ఉదయం 9 గంటలకు ఇద్దరు ఇతర ఖైదీలు నీరవ్ మోడీ ఉంటున్న సెల్‌లోకి ప్రవేశించి అతన్ని కొట్టి గాయపరిచారని చెప్పారు కీత్. ఇక జైలులో ఉన్న పోలీసులు నీరవ్ మోదీపై దాడి జరుగుతున్నప్పటికీ పట్టించుకోలేదని, లాయరును వెంటనే కలవాలని నీరవ్ అధికారులతో చెప్పగా వారు ఇందుకు నిరాకరించారని కీత్ చెప్పారు.

 ఇక తనపై జరిగిన దాడికి సంబంధించిన రుజువులను కోర్టుకు నివేదించిన నీరవ్ మోదీ.. తనను తిరిగి భారత్‌కు పంపిస్తే తనను తాను చంపుకుంటానని బెదిరింపులకు దిగాడు. అంతేకాదు భారత్‌లో తనకు సరైన న్యాయం జరగదని వెల్లడించాడు. ఇక నీరవ్ పై మళ్లీ దాడి జరిగే అవకాశం ఉన్నందున అతను ఉంటున్న జైలులో భద్రత పెంచాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు లాయర్. ఇక బెయిల్ మంజూరు చేస్తే బెయిల్ సెక్యూరిటీ కింద రెట్టింపు డబ్బులను తన క్లయింట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం 2 మిలియన్ పౌండ్లు అంటే.. రూ.18 కోట్లు ఉండగా దాన్ని 4 మిలియన్ పౌండ్లు అంటే రూ.36 కోట్లు కట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పాడు.

అయితే నీరవ్ మోదీని భారత్ అప్పగించాలంటూ.. భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ బలంగా వాదనలు వినిపించింది. అప్పగింత నుంచి తప్పించుకోవడానికే.. నీరవ్ మోదీ ఆత్మహత్య నాటకాలాడుతున్నాడని వాదించించింది. దీనిని బట్టి చూస్తేనే తప్పు చేసి తప్పించుకోవడానికి ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నాడో అర్థం చేసుకోవాలని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ కోర్టుకు విన్నవించింది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదనలతో ఏకీభవించిన వెస్ట్ మినిస్టర్ కోర్టు.. నీరవ్ మోదీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ మంజూరు చేస్తే నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని భావించిన చీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్‌నాట్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. అయితే, డిసెంబర్ 4న నీరవ్ మోదీ మరోసారి కోర్టు విచారణకు హాజరుకానున్నాడు.

ఇదిలావుంటే, నీరవ్ మోదీ చుట్టూ ఈడీ ఉచ్చుబిగిస్తోంది. తాజాగా నీరవ్ కు చెందిన 13 విలాసవంతమైన కార్లను వేలం వేసేందుకు ఈడీ సిద్ధమైంది. నీరవ్ మోదీ కార్లలో 2 కోట్లకుపైగా విలువైన బెంట్లీ కారుతో పాటు.. కోటీ 70 లక్షల విలువ చేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్, 60 లక్షల విలువ చేసే పోర్షే పనమేరా వంటి ఖరీదైన కార్లున్నాయి. అంతేకాదు, అతడికి చెందిన విలువైన వాచ్ లు, పెయింటింగ్స్ ను కూడా వేలం చేసేందుకు ఈడీ సిద్ధమైంది.

మొత్తానికి నీరవ్ మోదీకి బెయిల్ నిరాకరించడంతో.. అతన్ని భారత్ కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మార్గం సుగమమైంది. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ 14 వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయాడు. తొలుత న్యూయార్క్ నగరానికి.. ఆ తరువాత లండన్‌ లో ప్రత్యక్ష్యమయ్యాడు. వెస్ట్ ఎండ్‌లోని 60 కోట్ల విలువైన ఫ్లాట్‌లో నెలకు 15 లక్షల అద్దె చెల్లిస్తూ.. వజ్రాల వ్యాపారం నిర్వహించాడు. ఆమధ్య న్యూయార్క్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో కొన్నాళ్లు ఉన్నాడు. గతేడాది నవంబర్ లో ఇంటర్‌ పోల్ నీరవ్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

గత మార్చిలో బారు మీసాలు, గడ్డం పెంచి.. కాస్ట్‌లీ ఆస్ట్రిచ్ హైడ్ లెదర్ జాకెట్ వేసుకొని.. లండన్ వీధిలో కనిపించడంతో కలకలం రేగింది. నీరవ్‌ మోదీ లండన్‌లో వజ్రాల వ్యాపారం చేస్తున్నాడంటూ అప్పట్లో అక్కడ ఓ పత్రిక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో, నీరవ్ మోదీ లండన్ వీధుల్లో షికారు చేస్తూ టెలిగ్రాఫ్ జర్నలిస్ట్ కి చిక్కాడు. అతను వీడియో తీయడంతో కొత్త లుక్ లో ఉన్న నీరవ్ ఆచూకీ భారత్ కు తెలిసింది. విలేకరి అడిగిన ప్రశ్నలన్నింటికి ‘నో’ కామెంట్స్ అంటూ దాటవేయడంతోపాటు అప్పటికప్పుడు క్యాబ్‌లో అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులో నీరవ్‌ మోదీని అప్పగించాలని ఈడీ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు.. నీరవ్ మోదీ అరెస్ట్ కు వారెంట్ జారీచేసింది. ఆ తర్వాత పూర్తి నిఘా పెట్టిన లండన్ పోలీసులు.. మారువేషంలో తిరుగుతున్న నీరవ్ ను అదుపులోకి తీసుకున్నారు. మార్చి 19న ఓ బ్యాంకుకు వెళ్లిన నీరవ్ మోదీని గుర్తించిన అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు నీరవ్ మోదీని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన లండన్ లోని వాండ్స్ వర్త్ జైల్లో వున్నాడు. అయితే, తనను జైల్లో పెట్టినప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తూనేవున్నాడు. అయితే, నీరవ్ ను భారత్ కు అప్పగించాలంటూ.. భారత్ ఒత్తిడి చేస్తూనేవుంది. అంతేకాదు, నీరవ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ఈడీ బలమైన సాక్ష్యాలను కోర్టు ముందుంచింది. 

 గత మార్చిలో లండన్ వెళ్లిన ఈడీ అధికారులు.. ఆధారాలన్నింటినీ అక్కడి న్యాయంస్థానంలో ప్రవేశపెట్టారు. దీంతో నీరవ్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఈ నేపథ్యంలో నీరవ్ ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా.. కోర్టు తిరస్కరిస్తూనేవుంది. తాజాగా ఐదోసారి కూడా నీరవ్ మోదీకి లండన్ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయనను భారత్ కు అప్పగించే ప్రక్రియకు మరింత బలం చేకూరినట్టయింది. అన్నీ సవ్యంగా సాగితే.. మరికొద్ది రోజుల్లో నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.


ఇప్పటికే నీరవ్ మోదీ పై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ లు విచారణ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే నీరవ్ మోదీ కి సంబంధించిన రెండు వేల మూడు వందల కోట్ల వరకు ఆస్తులను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో నీరవ్ కు బెయిల్ నిరాకరించడంతో.. అతన్ని భారత్ కు తీసుకువచ్చే ప్రక్రియ వేగవంతం కానుంది. ఇంతకీ, నీరవ్ మోదీ నేర ప్రస్థానం ఏమిటి..? ఎన్నాళ్లుగా ఆయన బ్యాంకులకు టోకరా వేస్తూ వచ్చాడు..? పంజాబ్ నేషనల్ బ్యాంకును ఎంత మేర లూటీ చేశాడు..?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది మోసపూరితంగా.. బిలియనీర్‌ నీరవ్‌ మోదీ, ఆయన సంబంధీకులకు లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ జారీ చేసింది. దీన్ని ఉపయోగించుకుని మోదీతో పాటు మరికొంతమంది విదేశాల్లోని పలు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయి ఉద్యోగి కూడా ఈ మొత్తం వ్యవహారంలో కుమ్మక్కైనట్లు, 2011 నుంచి ఇది జరుగుతోందని వెల్లడైంది. పీఎన్‌బీ ప్రస్తావించకపోయినప్పటికీ.. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ మొదలైనవి ఎల్‌వోయూ ఆధారంగా రుణాలిచ్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

ఈ స్కామ్‌కి సంబంధించి అప్పట్లో సస్పెండైన వారిలో డిప్యూటీ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌ శెట్టితో పాటు మరికొంత మంది ఉన్నారు. గోకుల్ నాథ్ శెట్టి 2010 మార్చి 31 నుంచి ముంబైలోని పీఎన్‌బీ ఫారెక్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, లావాదేవీలను పసిగట్టలేని విధంగా ఖాతాల్లో ఎంట్రీలు చేయకుండా.. మరో ఉద్యోగి మనోజ్‌ ఖారత్‌తో కలిసి ఆయన వివాదాస్పద ఎల్‌వోయూలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ ఖాతాదారు థర్డ్‌ పార్టీకి చెల్లించాల్సిన మొత్తానికి హామీనిస్తూ బ్యాంకులు ఈ ఎల్‌వోయూలను జారీ చేస్తుంటాయి. వీటి ఆధారంగా విదేశాల్లోని బ్యాంకు శాఖలు బయ్యర్ క్రెడిట్స్ ఇస్తుంటాయి.

బయ్యర్స్ క్రెడిట్ అనేది ఒక స్వల్పకాలిక రుణ సదుపాయం. విదేశాల నుంచి సరుకు, సేవలు దిగుమతి చేసుకునే వ్యాపారులు, సంస్థలకు ఈ తరహా రుణ సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తుంటాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రుణాలు సర్వసాధారణమే. ఏ దేశం నుంచి ఏ వ్యాపారి, సంస్థ సరుకు లేదా సేవలు ఎగుమతి చేస్తాయో వారికి దిగుమతి చేసుకునే వారి తరుపున ఇచ్చే గ్యారెంటీ అన్నమాట.

జనవరి 16న డైమండ్ ఆర్‌యుఎస్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ అనే మూడు సంస్థలు తమకు బయర్స్ క్రెడిట్ కావాలంటూ ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక శాఖ అధికారులను కోరాయి. విదేశీ సరఫరాదారుల నుంచి సరుకు వస్తోందని తెలిపే కొన్ని పాత్రాలు చూపించి, వారికి చెల్లించేందుకు అవసరమైన రుణం కోసం లెటర్స్ ఆఫ్ అండర్‌ టేకింగ్ కావాలని విజ్ఞప్తి చేశాయి. ఈ సంస్థలు నీరవ్ మోదీ, ఆయన సోదరుడు నిశాల్ మోదీ, నీరవ్ భార్య అమీ నీరవ్ మోదీ, మరో వ్యాపార భాగస్వామి మెహుల్ చినూభాయ్ చోక్సీకి సంబంధించినవి.

నీరవ్ మోదీ అండ్ పార్టీకి చెందిన సంస్థలు ఎప్పుడైతే బయ్యర్స్ క్రెడిట్ కోసం లెటర్స్ ఆఫ్ అండర్‌ టేకింగ్స్ అడిగాయో అప్పుడే బ్యాంకు అధికారులు అందుకు 100 శాతం క్యాష్ మార్జిన్ సమర్పించాలని సూచించారు. దీనికి ఆ మూడు సంస్థలు.. అదేం అవసరం లేదని, తాము గతంలో క్యాష్ మార్జిన్ ఏమీ లేకుండానే లెటర్స్ ఆఫ్ అండర్‌ టేకింగ్ తీసుకున్నట్టు నమ్మబలికాయి. అయితే ఆయా సంస్థలకు రుణ పరిమితికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేకపోవడం బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది.

దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నతాధికారులు నీరవ్ మోదీ అండ్ పార్టీకి చెందిన సంస్థలకు రుణ మంజూరుకు సంబంధించి మరింత లోతుగా శోధించారు. దీంతో గతంలోనూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా ఇద్దరు బ్యాంకు ఉద్యుగులు వారి సంస్థలకు లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్ ఇచ్చిన విషయం బయటపడింది. ఈ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు కూడా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. చేసిన పాడుపని ఎక్కడా బ్యాంకు రికార్డుల్లోకి రాకుండా చూసుకున్నారు. పీఎన్బీ అధికారులతో కుమ్మక్కయి ఇలా తీసుకున్న ఎల్‌ఒయుల ఆధారంగా ఈ డైమండ్‌ వ్యాపార సంస్థలు విదేశాల్లోని ఇతర బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునేవని తెలిసింది.

 మొత్తానికి, విజయ్ మాల్యా లాగే.. బ్యాంకులకు కన్నం వేసిన నీరవ్ మోదీ.. విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి అతన్ని భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అయితే, మోదీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినా, అతని అరెస్ట్‌ కోసం ఇంటర్‌ పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీచేసినా.. లండన్‌లో తాను నివాసముంటున్న ప్రాంతానికి సమీపంలోనే కొత్తగా వజ్రాల వ్యాపారం ప్రారంభించి మొన్నటిదాకా యదేచ్ఛగా తిరిగాడు. మీసాలు పెంచి, వేషం మార్చి లండన్ వీధుల్లో తిరుగుతున్న నీరవ్ మోదీ వీడియో అప్పట్లో వైరలైంది. 

ఈ నేపథ్యంలో, వేషం మార్చి తిరుగుతున్న మోదీ.. మార్చి 19న లండన్ లోని ఓ బ్యాంకుకు వెళ్లాడు. అయితే, అతన్ని గుర్తుపట్టిన బ్యాంకు ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నీరవ్ బండారం బయటపడింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన లండన్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అయితే, తనను అరెస్ట్ చేసిన వెంటనే, బెయిల్ కోసం అప్లయి చేసుకున్న నీరవ్ కు కోర్టులో చుక్కెదురైంది. ఇక గత మార్చి 28న రెండోసారి కూడా బెయిల్ నిరాకరించింది లండన్ కోర్టు.

ఆర్థిక నేరగాళ్ల భరతం పట్టేందుకు మోదీ సర్కార్ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక నేరగాళ్ల చట్టం అమల్లోకి రావడం.. వారిని అప్పగించాలంటూ అంతర్జాతీయ వేదికలపై మోదీ పిలుపునివ్వడం.. అందుకు దేశాధినేతలు కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తుండటం శుభపరిణామం. ఇప్పటికే అగస్టా నిందితుడు క్రిస్టియన్ మిషెల్ ను భారత్ కు రప్పించిన మోదీ సర్కార్ కు.. ఇటీవల మాల్యాను అప్పగిస్తామని బ్రిటన్ తెలుపడం.. తాజాగా నీరవ్ మోదీ ఎపిసోడ్ మరింత ఊపునిచ్చింది. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వానికి ఇది గొప్ప విజయమని చెప్పక తప్పదు. ఇదే జోష్ తో ముందుకు సాగితే మిగతా ఆర్థిక నేరగాళ్లను కూడా రప్పించడం అంత కష్టమేం కాదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

 బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి దేశం నుంచి పారిపోతున్న కార్పొరేట్ మోసగాళ్ల భరతం పట్టేందుకు.. గతేడాది జూలైలో కేంద్రం ఆర్థిక నేరగాళ్ల చట్టం తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ పట్టుబట్టీ మరీ.. ఉభయ సభల్లో బిల్లును పాస్ చేయించారు. అది చట్టంగా మారిన తర్వాత.. ఇక ఆర్థిక నేరగాళ్లను పట్టుకురావడంపై మరింత దృష్టిసారించారు. ఇక మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద.. పారిపోయిన తొలి ఆర్థిక నేరస్థుడిగా  భారతీయ వ్యాపారి మాల్యా పేరును ప్రకటించారు. ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం మాల్యాను ఈ విధంగా ప్రకటించింది.

విదేశాల్లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లను తీసుకొచ్చే క్రమంలో.. ఆయా దేశాలతో ప్రధాని మోదీ నెరపిన దౌత్యం కూడా ఫలితాలనిస్తోంది. ఆర్థిక నేరగాళ్ల ఖాతాలను స్తంభింప చేయాలని, వారిని వీలైనంత త్వరగా స్వదేశాలకు పంపే ప్రక్రియలో.. సహకారం అందించుకోవాలని పలు అంతర్జాతీయ వేదికలపై మోదీ విజ్ఞప్తి చేశారు. అర్జెంటీనా బ్యూనస్ ఏర్స్ లో గత డిసెంబర్ 1న జరిగిన జీ-20 సదస్సులో కూడా ప్రపంచ దేశాలకు మోదీ ఇదే పిలుపునిచ్చారు.

అంతేకాదు, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులను వెనక్కి రప్పించి.. చట్టం ముందు నిలబెట్టేందుకు దౌత్యపరమైన మార్గాలతో పాటు అన్ని మార్గాల్లోనూ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. 2019 తొలి ఇంటర్వ్యూలోనే ప్రధాని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గత జనవరి 1న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక నేరగాళ్ల భరతం పడతామని చెప్పకనే చెప్పారు.

ఆర్థిక నేరగాళ్లకు ముకుతాడు వేస్తానని చెప్పిన మోదీ.. చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేసినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ నిందితుడు క్రిస్టియన్ మిషెల్ ను భారత్ కు రప్పించారు. ఇప్పుడు మాల్యా, నీరవ్ మోదీల వంతు వచ్చింది.

అయితే, తనను భారత్ కు అప్పగించాలన్న నిర్ణయంపై బ్రిటన్‌ ఉన్నత న్యాయస్థానాల్లో బెయిల్ పొందిన విజయ్ మాల్యా ఇంకా అక్కడే వున్నాడు. దీంతో ఈ సుదీర్ఘ న్యాయపోరాటం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఒకవేళ మాల్యా రాకకు అన్ని ఆటంకాలు తొలిగిపోయినా.. ఆయన రావడానికి కనీసం ఏడాది పడుతుందని కొందరి అంచనా.

భారత్‌ - బ్రిటన్‌ అప్పగింతల ఒప్పందం కుదిరిన దశాబ్దంన్నర కాలంలో ఇప్పటివరకు ఒకే ఒక్కరిని వెనక్కు రప్పించగలిగింది. గోద్రా అనంతర ఘటనల్లో పాలుపంచుకున్న సమీర్‌ భాయ్‌ వినూ భాయ్‌ పటేల్‌ 2016లో ఇలా వచ్చారు. ఈ లెక్కన మాల్యా, నీరవ్ లను తీసుకురావడంలో ఎంత జాప్యం జరిగినా అది భారత్‌కు విజయోత్సాహాన్నిచ్చేదే. ఈ దేశ ప్రజల సొమ్ముదోచుకొని విదేశాలకు పోయి విలాసాలు చేస్తున్న మాల్యా, నీవర్ మోదీ వంటి అనేకులకు ఇది హెచ్చరికగా పనిచేస్తుంది. పాలకుల్లో పట్టుదల ఉంటే, సమస్త వ్యవస్థలను సంఘటితం చేసి తదేక దృష్టితో కృషి చేస్తే ఇటువంటివారిని వెనక్కు తీసుకురావడం అసాధ్యమేమీ కాదు.

ఈ పిడికెడు మంది మాత్రమే కాదు, ఈ దేశ బ్యాంకులను ముంచి, ఇక్కడినుంచి ఎగిరిపోయినవారి సంఖ్య రెండు పదులు దాటే ఉందని నివేదికలు చెబుతున్నాయి. బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్లు 60 మందికి పైగానే వున్నట్టు తెలుస్తోంది. ఈ వైట్‌కాలర్‌ నేరగాళ్లను వెనక్కి రప్పించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విజయ్‌ మాల్యా, నీరవ్ మోదీ మాత్రమే కాదు.. మొహుల్‌ చోక్సీ, నితిన్, చేతన్‌ సందేస్రా, లలిత్‌ మోదీ, యూరోపియన్‌ దళారీ గ్యూడో రాల్ఫ్‌ హస్చకే, కార్ల్‌ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్‌ అవుట్‌ సర్క్యులర్స్‌, ఇంటర్‌ పోల్‌ ద్వారా నోటీసులు ఇప్పటికే జారీ చేశామని కేంద్రం తెలిపింది.

బ్రిటన్, యూఏఈ, బెల్జియం, ఈజిప్ట్, అమెరికా, అంటిగా, బార్బుడా దేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను తమకు అప్పగించాల్సిందిగా భారత్‌ ఆయా దేశాల ప్రభుత్వాలకు అప్పగింత అభ్యర్థనలను సమర్పించింది. ఇప్పటిదాకా చేసిన 16 అప్పగింత అభ్యర్థనలు ఎంతవరకు పురోగతి సాధించాయో అని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, డీఆర్‌ఐ వంటి సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలపై మరింత ఒత్తిడిపెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లోక్‌సభకు తెలిపింది. 

వీవీఐపీ హెలికాప్టర్ల స్కామ్‌లో మధ్యవర్తిగా వ్యవహరించిన గ్యూడో రాల్ఫ్, కార్లో గెరోసాల అప్పగింత అభ్యర్థన, సంబంధిత నోటీసుల తాజా పరిస్థితిని విదేశాంగ శాఖ లోక్‌సభకు నివేదించింది. గెరోసా అప్పగింతపై గత ఏడాది నవంబర్‌లో, గ్యూడో అప్పగింతపై ఈ ఏడాది జనవరిలో అభ్యర్థనలు పంపిస్తే వాటిని ఇటలీ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపింది.

రూ.13 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మొహుల్‌ చోక్సీ అప్పగింతపై 2 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. చోక్సీపై ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. గుజరాత్‌కు చెందిన వ్యాపారి ఆశిష్‌ జోబన్‌పుత్ర, ఆయన భార్య ప్రీతిని అమెరికా నుంచి రప్పించడానికి ట్రంప్‌ సర్కార్‌కు భారత్‌ ఇప్పటికే అప్పగింత విజ్ఞప్తులు పంపింది. దీపక్ తల్వార్‌ను యూఏఈ నుంచి తీసుకురావడానికి అవసరమైన న్యాయపోరాటం చేస్తోంది.

స్టెర్లింగ్‌ బయోటెక్‌ ద్వారా బ్యాంకులకు 5 వేల కోట్లు ఎగ్గొట్టిన చేతన్, నితిన్, దీప్తి సందేసర, హితేష్‌ కుమార్‌ పటేల్‌ లపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్‌ను వెనక్కి తీసుకురావడంలో సక్సెస్‌ సాధించిన బీజేపీ సర్కారు మిగిలిన వారిని కూడా తీసుకువస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉంది.