Sunday, August 18, 2019
Follow Us on :

నేడు 25 లక్షల మందితో మోదీ ఫోన్‌ సంభాషణ

By BhaaratToday | Published On Mar 20th, 2019

నేనూ కాపలాదారునే (మై భీ చౌకీదార్‌) ప్రచారాన్ని ప్రధాని మోదీ ఉధృతం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది వాచ్‌మన్‌లతో బుధవారం ఫోన్‌ ద్వారా సంభాషించనున్నారు. దీంతో పాటు ఈనెల 31వ తేదీన దేశవ్యాప్తంగా 500 ప్రాంతాలకు చెందిన వివిధ రంగాల ప్రజలతో ముఖాముఖి జరపనున్నారు. పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో వారి మద్దతు కోరనున్నారు. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశ వ్యాప్తంగా 500 ప్రాంతాలకు చెందిన బీజేపీ, అనుబంధ సంస్థల నేతలు, వృత్తి నిపుణులు, రైతులు తదితరులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించనున్నార‌ని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరడంతోపాటు ‘నేనూ కాపలాదారునే’ అంటూ వారితో ప్రతిజ్ఞ చేయించనున్నారు. ట్విట్టర్‌లో ‘మై భీ చౌకీదార్‌’ హ్యాష్‌ట్యాగ్‌ను 20 లక్షల మంది రీట్వీట్‌ చేయగా 1980 కోట్ల స్పందనలు వచ్చాయి’ అని మంత్రి పేర్కొన్నారు. ‘కాపలాదారే దొంగ’ అంటూ ప్రధానిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ చేస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకే ఈ ఉద్యమం చేపట్టారా అన్న ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ దేశానికి మొదటి సేవకునిగా, కాపలాదారుగా ఉంటానంటూ మాట ఇచ్చారని గుర్తు చేశారు.