Wednesday, October 16, 2019
Follow Us on :

ఓ వైపు బిల్లుకు ఆమోదం.. మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను ఎలా కట్టడి చేశారంటే..!

By BhaaratToday | Published On Aug 5th, 2019

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. దీంతో, ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి రాజ్యసభ ఆమోదం లభించినట్టయింది. ఈ తీర్మానం బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు లభించగా, ఒక ఓటు తటస్థంగా ఉంది. బిల్లుపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరడంతో, అందుకు, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించారు. అయితే, సాంకేతిక కారణాలు తలెత్తడంతో ఆటోమేటిక్ ఓటింగ్ రికార్డింగ్ వ్యవస్థ పని చేయలేదు. దీంతో, స్లిప్పులతోనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. 

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను నిన్న హౌస్ అరెస్టు చేశారు.  పోలీసులు అరెస్టు చేశారు. ముఫ్తీని హరినివాస్ అతిథి గృహానికి తరలించినట్టు సమాచారం. ఆమెతో పాటు మరికొందరు నేతలనూ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
ముఫ్తీ, ఒమర్ లు హౌస్ అరెస్టు అయ్యాక వేర్వేరు ట్వీట్లు చేశారు. ఏం జరగబోతోందో మనకు తెలియదని, మనకు మంచిది అనుకునేదే అల్లాహ్ చేస్తాడని నమ్ముతానని ఒమర్ ట్వీట్ చేశారు. శాంతి కోసం పోరాడే తమ లాంటి ప్రజాప్రతినిధులను హౌస్ అరెస్టు చేశారని, కశ్మీర్ ప్రజల గొంతు ఎలా నొక్కుతున్నారో ప్రపంచమంతా చూస్తోందని ముఫ్తీ తన ట్వీట్ లో విమర్శించారు.

రాజ్యసభలో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు కానుంది. అయితే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ముందస్తు ప్రణాళిక ప్రకారం, బీజేపీ ఆలోచనలను పక్కాగా అమలు చేశారు. ఈ ఉదయం 11.15 గంటల సమయంలో నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దుకు సిఫార్సు చేయడం, ఆపై వెంటనే మూజువాణీ ఓటింగ్ తో సభ బిల్లు ఆమోదించగా, 11. 25 గంటల సమయంలోనే రాష్రపతి రామ్ నాథ్ కోవింగ్ కార్యాలయం నుంచి ఆ బిల్లుపై సంతకం చేస్తున్నట్టుగా గజిట్ ను వెలువరించింది.

జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడనున్నాయి.