Saturday, October 19, 2019
Follow Us on :

ఉల్లిపాయలను కూడా దొంగతనం చేస్తున్నారండోయ్

By BhaaratToday | Published On Sep 24th, 2019

ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. ముందుగానే కొని తెచ్చుకున్న వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కొనేవాళ్లకు ఉల్లి ధర కన్నీళ్లు పెట్టిస్తున్న సమయంలో.. ఓ రైతు దగ్గర ఉన్న ఉల్లిపాయలను కొట్టేసి అతన్ని మరింత శోకసంద్రం లోకి నెట్టేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

నాసిక్ జిల్లాలోని కుల్వన్ తాలూకాకు చెందిన రాహుల్ బాజీరావ్ ఉల్లి వ్యాపారి. అతడు వేసవిలో ఉల్లిపాయలను సాగు చేశాడు. వాటిని తన స్టోర్ రూమ్ లో  భద్రపరిచాడు. ఇటీవలి కాలంలో ఉల్లిపాయల ధర పెరిగిపోవడంతో వాటిని అమ్ముకోవాలని భావించాడు. అయితే ఆ ఉల్లిపాయలపై దొంగలు కన్నేశారని అసలు ఊహించలేదు. అతని దగ్గర ఉన్న 25 టన్నుల ఉల్లిపాయలను 117 ప్లాస్టిక్ సంచులలో ఉంచగా వాటిని కాస్తా కొట్టేశారు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు రాహుల్ బాజీరావ్. దొంగిలించిన ఉల్లిపాయల విలువ లక్ష రూపాయలు పైనే..! కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక మార్కెట్ లలోనూ, గుజరాత్ లోని కొన్ని మార్కెట్ లలోనూ వెతకడం మొదలుపెట్టారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో 70 నుండి 80 రూపాయల వరకూ కిలో ఉల్లిపాయలను అమ్ముతున్నారు.