Saturday, October 19, 2019
Follow Us on :

ఆపరేషన్ కశ్మీర్..!... అమర్ నాథ్ యాత్రకు బ్రేకులు

By BhaaratToday | Published On Aug 4th, 2019

-లోయలో ఆర్మీ మోహరింపులు
-ఉగ్ర కుట్రను భగ్నం చేయడమే లక్ష్యమా..?
-లేక, ఇది కొత్త చరిత్రకు శ్రీకారమా..?
-కశ్మీర్ లో అనూహ్య పరిణామాలు
-భయాందోళనలో స్థానిక ప్రజలు

అమర్ నాథ్ యాత్రకు బ్రేకులు పడ్డాయి. లోయలో ఆర్మీ భారీగా మోహరించింది. కశ్మీర్ లో అనూహ్య పరిణామాలతో స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అయితే పాక్ ఉగ్రవాదులు పన్నిన ఉగ్ర కుట్రను భగ్నం చేశారు భారత ఆర్మీజవాన్లు.
ఈ నేపథ్యంలో మొదట పదివేలు, ఆ తర్వాత 28 వేలు.. తాజాగా 40 వేల మంది సైన్యం మోహరించింది. ఇప్పటికే అమర్ నాథ్, ముచేల్ మాతా యాత్రలు రద్దు చేసుకుని తిరుగుముఖం పట్టారు యాత్రికులు. విద్యాసంస్థలకు సైతం సెలవులు ప్రకటించింది అక్కడి సర్కార్. అసలు కశ్మీర్ లో ఏం జరుగుతోంది..? కేంద్రం ప్రభుత్వం ఎందుకీ చర్యలు చేపట్టింది..? గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే చర్చ.

ఎక్కడి రాజకీయ పార్టీల్లో టెన్షన్…టెన్షన్..
జమ్మూకశ్మీర్‌కి భారీ ఎత్తున కేంద్ర బలగాలు వస్తుంటే.. అక్కడి రాజకీయ పార్టీల్లో ఎక్కడ లేని టెన్షన్ మొదలైంది. కశ్మీర్‌లో కొంపలు మునిగిపోయే పరిస్థితులు ఏవీ లేవనీ, కేంద్ర ప్రభుత్వం అనవసరంగా హడావుడి చేస్తోందని స్థానిక పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. కశ్మీర్ లో సైనిక బలగాలను మోహరించి.. కేంద్రం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమర్ నాథ్ యాత్రపై ఉగ్ర కుట్రను భగ్నం చేయాలంటే.. ఇంత పెద్దయెత్తన బలగాలను మోహరించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు విపక్ష పార్టీల నేతలు. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు.. కేంద్రం కశ్మీర్ లో ఆర్టికల్ 35ఎ, ఆర్టికల్ 370 లను రద్దు చేయబోతోందా..? ఎన్డీఏ సర్కార్ వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తోందా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ.. ఆ దిశగా అడుగులు వేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి.

ప్రపంచంలోనే ఒక అద్భుతమైన యాత్రగా అమర్‌నాథ్‌యాత్రకు పేరుంది. పరమ పవిత్రంగా భావించి వేలాదిమంది ఈ సహసయాత్రకు ఏటా వెళ్తారు. అయితే, జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఉన్నఫళంగా యాత్రికులకు హెచ్చరికలు జారీచేసింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు, ఇతర పర్యాటకులు వెంటనే తిరుగుముఖం పట్టాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం సూచించింది. అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పర్యాటకులపై, ప్రత్యేకంగా అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రమూకలు దృష్టి సారించినందున వీలైనంత త్వరగా వెనుదిరగాలని ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. అమర్‌నాథ్ యాత్రలో హింసను సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని భారత ఆర్మీ ప్రకటించిన కొద్దిసేపటికే.. అమర్ నాథ్ యాత్రను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కశ్మీర్‌లో అలజడులు సృష్టించి.. శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందన్నారు ఆ రాష్ట్ర డీజీపీ దిల్బాగ్‌ సింగ్. ఈ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న అన్ని ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని చూపించారు. అమర్ నాథ్ యాత్రను ఎందుకు రద్దుచేశారనేదానిపై ఆర్మీ అధికారులు వివరణ ఇచ్చారు. యాత్ర దారిలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని…ల్యాండ్‌మైన్లు, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్ ప్రకటించారు. మూడు రోజుల క్రితం అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ఐఈడీలు, ల్యాండ్‌మైన్లు, అమెరికన్ మేడ్ స్నైపర్ రైఫిల్ లభ్యమయ్యాయని తెలిపారు. దీంతో కశ్మీర్‌లో లోయ మొత్తం జల్లెడ పట్టాలని అధికారులను సర్కార్ ఆదేశించింది. ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేసి.. ఆయుధాలను, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామని.. ఇది పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులపనేనని ధిల్లాన్ అన్నారు. ఇక బలగాల మోహరింపు భద్రత కోసమే కానీ.. ఎలాంటి చర్యలకు దిగబోయేది లేదన్నారు. అయితే పాకిస్థాన్ చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయని తెలిపారు. పాకిస్థాన్ ఇలానే ఉగ్రవాదులను భారత్ మీదకు వదిలితే.. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే టెర్రరిస్టులు పదిసార్లు దాడికి యత్నించినట్లు కాశ్మీర్ ఐజీ పాని తెలిపారు. మున్నాలాహోరీ, కమ్రాన్, ఉస్మాన్ వంటి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామన్నారు. 

భారీగా కేంద్ర బలగాలు:
తాజా పరిస్థితుల నేపథ్యంలో కశ్మీర్లోని ఫూంచ్, రాజౌరీ సెక్టారుకి కేంద్ర బలగాలను భారీగా తరలించారు. ఇప్పటికి 35 వేల కేంద్ర బలగాలు జమ్మూ కాశ్మీర్ కు చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వ ప్రకటనతో కాశ్మీర్ ప్రజల్లో ఆందోళన నెలకొంది. కేంద్ర బలగాల మొహరింపు చూసి ప్రజలు పెట్రోలు, నిత్యావసర వస్తువులను నిల్వచేసుకుంటున్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత కొన్ని ప్రాంతాల్లో షాపులను మూసేస్తున్నారు. దాంతో, ఏటీఎంలు, పెట్రోలు బంకులు, మెడికల్‌ షాపులు, దుకాణాల్లో పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. 

ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కి  సాయుధ బలగాల తరలించటంపై ప్రజలు భయాందోళనలు చెందవద్దని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచించారు. ఉగ్రవాదుల దాడులు జరుగుతాయనే ముందస్తు సమాచారంతో భద్రతా చర్యల్లో భాగంగానే ప్రభుత్వం భారీగా బలగాలను మొహరించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పరిస్ధితులు అదుపులోనే ఉన్నాయని.. అమర్ నాథ్ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారనే  నిఘావర్గాల సూచనలతోనే యాత్రికులను వెనక్కి రావాలని హెచ్చరించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

విద్యార్థులకు సెలవులు:
మరోవైపు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్‌లోని ఎన్.ఐ.టి. యాజమాన్యం సెలవులు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు  వచ్చేంత వరకు తరగతులు ఉండవని తెలిపింది. ఈ క్రమంలో శ్రీనగర్‌లోని ఎన్ఐటీ క్యాంపస్ నుంచి విద్యార్థులు ఇంటికెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో విద్యార్థులు తమ స్వస్థలాలకు బయల్దేరారు. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. విద్యార్థులు తిరిగి వచ్చేందుకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విద్యార్థులు క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని కోరారు. ఇప్పటికే అధికారులను అటాచ్ చేశామని అందులో పేర్కొన్నారు. అంతేకాదు సాయం కోసం రెసిడెంట్ కమిషనర్‌ వేదాంతంను సంప్రదించాలని కోరారు.

యాత్రికుల తిరుగు ప్రయాణం:
మరోవైపు అమర్ నాధ్ యాత్రను నిలిపివేసిన నేపథ్యంలో యాత్రికులు తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీనగర్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు పర్యాటకులు, తీర్ధయాత్రకు వచ్చినవారంతా ఒక్కసారిగా శ్రీనగర్‌ విమానాశ్రయానికి క్యూ కట్టడంతో వారికి టికెట్లు దొరకడం లేదు. శ్రీనగర్ నుంచి అదనపు విమానాలను నడపడానికి విమానయాన సంస్థలు సిద్ధంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. రద్దీకి అనుగుణంగా జమ్మూకశ్మీర్‌ విమాన సర్వీసులను రీషెడ్యూల్‌ చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్టారా ప్రకటించాయి.