Wednesday, November 20, 2019
Follow Us on :

275 మందిని సిద్ధంగా ఉంచిన పాకిస్థాన్.. ఏ క్షణమైనా..!

By BhaaratToday | Published On Sep 11th, 2019

జమ్మూకాశ్మీర్ లో శాంతిని నెలకొల్పటానికి భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ పాక్ మాత్రం కాశ్మీర్ లో శాంతి అన్నది లేకుండా చేయాలని.. భారత్ లో ఉగ్రదాడులు జరిపి శాంతిని హరించాలని ప్రయత్నిస్తోంది. అక్కడితో ఆగకుండా భారత్ లోకి తీవ్రవాదులను పంపించాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ లోకి పంపి విధ్వంసం సృష్టించాలని భావిస్తోంది.  

అనుకున్నట్లుగానే వాస్తవాధీన రేఖ వెంబడి 7 టెర్రర్ లాంచ్ ప్యాడ్ లను సిద్ధం చేసేసింది పాకిస్థాన్. అంతేకాకుండా చొరబాట్లకు సిద్ధంగా 275 మందిని ఉంచారు. ఆఫ్గనిస్థాన్, ఫుష్తున్ కు చెందిన ఉగ్రవాదులు ఏ క్షణమైనా సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కాశ్మీర్ లోని గురేజ్ ప్రాంతం ద్వారా చొరబాటుకు యత్నిస్తోంది. గురేజ్ ప్రాంతంలో 80, మంచాల్ సమీపంలో 60, కర్నాహ్ లో 50, కరేన్ లో 40,  యూరీ సమీపంలో 20, నౌగామ్ లో 15, రాంపూర్ సమీపంలో 10 మంది ఉగ్రవాదులను  పాక్ ఉంచింది. 

ఇక ఇటీవలే చొరబాట్లకు సంబంధించిన సాక్ష్యాలను భారత్ ప్రపంచ దేశాల ముందు ఉంచింది. పాకిస్థాన్ కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) ను అడ్డుగా పెట్టుకొని తీవ్రవాదులు భారత్ లోకి చొరబడాలని చూస్తున్నారు. బ్యాట్ కమాండోల దగ్గరే దాక్కున్న ఉగ్రవాదులు అనుకూల ప్రదేశంలో భారత్ లోకి ప్రవేశించాలన్న విషయాన్ని భారత సైన్యం పసిగట్టింది. బ్యాట్ కమాండోలు, ఉగ్రవాదుల శవాలు చెల్లాచెదరుగా పడివున్న దృశ్యాలను భారత్ ఆర్మీ బయటపెట్టింది. మృతదేహాల వద్ద పాకిస్థాన్ జెండాలు, ఇతర సామగ్రి కూడా ఆ వీడియోలో ఉన్నాయి.