Tuesday, June 18, 2019
Follow Us on :

అయ్యయ్యో సర్ఫరాజ్.. ఇలా జరిగిందేంటి..!

By BhaaratToday | Published On Jun 13th, 2019

పాకిస్థాన్ జట్టును చూసి.. మిగిలిన జట్లు భయపడుతున్నాయి.. ఇదీ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్న మాటలు..! కానీ వరల్డ్ కప్ లో మాత్రం పాకిస్థాన్ ఆట  తీరు మాత్రం వేరేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండు మ్యాచులు ఓడిపోయింది పాకిస్థాన్.. ఒక్క విజయం సాధించగా.. మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఆఖరి నుండి మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ను విజయం ఊరించి.. ఉసూరుమనిపించింది. టాంటన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు బాగా ఆడారు. తొలి వికెట్‌కు 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫించ్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 111 బంతుల్లో 11  ఫోర్లు, సిక్సర్‌తో 107 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుట్ అయ్యాక ఆస్ట్రేలియా వరుసగా వికెట్లను కోల్పోయింది. 360 పరుగులు చేసే అవకాశం ఉన్నా మాక్స్ వెల్, షాన్ మార్ష్, కౌల్టర్ నైల్ ఇలా అందరూ వెంట వెంటనే అవుట్ అవడంతో పాక్ మ్యాచ్ లో తిరిగి పట్టు సాధించింది. పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ పది ఓవర్లు వేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

308 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఇమాముల్ హక్ 53, బాబర్ ఆజం 30, మహ్మద్ హఫీజ్ 46, హసన్ అలీ 32, వాహబ్ రియాజ్ 45 పరుగులు చేశారు.. కానీ కీలక దశలో వికెట్లు కోల్పోయింది పాకిస్థాన్. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 40 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అవతలి ఎండ్ లో సర్ఫరాజ్ బాగా ఆడుతున్నా.. మరో ఎండ్ లో పాక్ వికెట్లను కోల్పోతూ వచ్చింది. చివరికి  పాకిస్థాన్ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అవడంతో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇంకో రెండు మ్యాచులు ఓడిపోవడమో.. లేదా వర్షం పడి రద్దవడమో జరిగితే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కథ ముగిసినట్లే..!