Friday, December 06, 2019
Follow Us on :

పాకిస్థాన్ కు ఇక వేరే దారిలేదు.. తెరవక తప్పలేదు

By BhaaratToday | Published On Jul 16th, 2019

బాలాకోట్ దాడుల అనంతరం పాకిస్థాన్ తన గగనతలంపై వివిధ దేశాలకు ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ అధీనంలో 11 వాయు మార్గాలు ఉండగా కేవలం రెండు రూట్లలో మాత్రమే భారత విమానాలు ప్రయాణించేందుకు పాక్ ఇన్ని రోజులూ అనుమతించింది. అయితే ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. తమ గగనతలం మీదుగా అన్ని పౌరవిమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసింది. అయితే ఎయిర్‌బేస్‌ల నుంచి భారత్ జెట్ యుద్ధ విమానాలను ఉపసంహరించుకునే వరకు వాణిజ్య విమానాలకు అనుమతి మాత్రం ఇవ్వమని చెప్పింది. 

బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేసింది. ఈ దాడి తర్వాత పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో మూసివేసిన 11 వాయుమార్గాల్లో ఒకటి లేదా రెండు రూట్లను తెరిచింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజ్ స్థాన్ లో జరిగిన  షాంఘాయ్ సహకార సంస్థ సదస్సుకు పాక్ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని అప్పట్లో భారత ప్రభుత్వం కోరింది. అయితే పాకిస్థాన్ దీనిపై సానుకూలంగా స్పందించింది. మోదీ ప్రయాణించే విమానం అనుకున్న రూట్ లోనే వెళ్లవచ్చని తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని పాకిస్థాన్ చెప్పింది. అయితే చివరి నిమిషంలో మోదీ వెళ్లే రూట్ ను మార్చేశారు. ఎస్‌సీఓ సదస్సుకు పాకిస్థాన్ అధీనంలో ఉన్న వాయు మార్గాలు నుంచి కాకుండా ఒమెన్ మార్గం గుండా వెళ్లారు. మోదీ వీవీఐపీ విమానంలో ఒమెన్, ఇరాన్, సెంట్రల్ ఆసియా దేశాల గుండా బిష్కెక్ చేరుకున్న సంగతి తెలిసిందే.