Tuesday, October 15, 2019
Follow Us on :

మోదీ సభకు ట్రంప్ హాజరు కావడం పాకిస్తాన్‌కు పిడుగుపాటే..!

By BhaaratToday | Published On Sep 22nd, 2019

మోదీ సభకు ట్రంప్ హాజరు కానున్నారని.. అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటన పాకిస్తాన్‌కు పిడుగుపాటులా తగిలింది. ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి.. భారత్ పై పాక్ విషయం కక్కుతోంది. ఇస్లామాబాద్ తీవ్రమైన, అసత్య ప్రచారానికి దిగుతోంది. సరిగ్గా సమయంలో మోదీకి అనుకూలంగా అమెరికా ఇలాంటి ప్రకటన చేయడం ప్రధాన్యత సంతరించుకుంది.

కశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన నాటి నుంచి భారత్ పై పాకిస్తాన్ అవాకులు చెవాకులు పేలుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచిపోషిస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకున్నా.. అణు యుద్ధమంటూ అసంబద్ధ ప్రేలాపనలు చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆ దేశానికి చెందిన మంత్రులు సైతం విషం కక్కుతూనేవున్నారు. ముస్లింలు మెజార్టీగా ఉండే కశ్మీర్ లో మానవ హక్కులు, పౌర హక్కుల పరిస్థితి దిగజారిపోయిందని పాక్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ విద్వేష ప్రచారాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అమెరికా అధ్యక్ష భవనం ఉగ్రదేశానికి షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ తలపెట్టనున్న ర్యాలీకి ట్రంప్ హాజరవుతున్నారని స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడి సొంత గడ్డమీద భారత ప్రధాని భారీ ర్యాలీ, దానికి ట్రంప్ హాజరుకావడం అరుదైన విషయం. అంతేకాదు, పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించే విషయం కూడా. ట్రంప్‌తో పాటు అమెరికాలోని ఉభయ రాజకీయ పార్టీలకు చెందిన 60 మందికి పైగా అమెరికా చట్టసభల ప్రతినిధులు ‘హౌదీ-మోదీ’ సభకు హాజరు కానుండటం పాకిస్తాన్ కు మింగుడు పడటం లేదు. హ్యూస్టన్‌లో 50 వేల మంది పాల్గొనే భారీ ర్యాలీకి ట్రంప్ హాజరుకావడం ఉగ్రదేశానికి ఆశనిపాతంగా మారింది. కశ్మీర్ పరిస్థితిపై బురద చల్లాలని పాక్ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉమ్మడి విలువలు, వ్యాపార బంధాలు  అమెరికా, భారత్ సంబంధాలను మరింత దృఢతరం చేస్తున్నాయనే వాస్తవం పాక్‌కి మెల్లగానే బోధపడినట్లయింది. 

శాకాహారి అయిన మోదీ, పచ్చి మాంసాహారి ట్రంప్ ఒకే ర్యాలీలో పాల్గొనడం ఏమిటంటూ.. అమెరికాలోని ఉదారవాదులు విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం పాకిస్తాన్‌కు మాత్రం సాధ్యం కావడం లేదు. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని వైట్ హౌస్‌లో తన పక్కన కూర్చుండబెట్టుకుని కశ్మీర్ సమస్యపై తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పిన ట్రంప్.. ఆర్టికల్ 370నే రద్దు చేసి పడేసిన మోదీతో భారీ ర్యాలీలో ఎలా పాల్గొంటారన్నది పాకిస్తాన్ ప్రజలకు కూడా మింగుడు పడని విషయమే.

భారత్‌తో బిజినెస్, వాణిజ్య లోటు అనేవే ట్రంప్‌ని పాక్ వైపుకంటే భారత్ వైపే మొగ్గు చూపేలా ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఈ వాస్తవాన్ని విస్మరించి.. కశ్మీర్ విషయంలో ఎంతవరకైనా వెళ్తానని, భారత్ అంతు చూస్తానని, ఇరుదేశాల మధ్య అణుయుద్ధం తప్పదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎంత డాంభికాలు పలికినా ప్రయోజనం శూన్యమని స్పష్టమవుతోంది. 

ఈ క్రమంలో పాక్ ప్రధాని మరికొన్ని షాక్‌లు తినక తప్పదనిపిస్తుంది. అమెరికన్ రాజకీయ చరిత్రలో ఒక పరాయి దేశ పాలకుడి ర్యాలీకి అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు 60 మందికి పైగా అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధులు హాజరు కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘హౌదీ-మోదీ’ సభ భారత్-అమెరికా సంబంధాలు కొత్తపుంతలు తొక్కేందుకు నాంది అవుతుందని.. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు చెక్ పెట్టే ప్రకటలను వెలువడుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్, మోదీ ఒకే వేదికను పంచుకోవడంపై భారత విదేశాంగ మంత్రి జైశకంర్ స్పందించారు. ‘హౌదీ-మోదీ’ సమావేశంలో పలు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలావుంటే, జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో.. అమెరికా సెనేటర్లలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మోదీతో ట్రంప్ వేదికను పంచుకోనుండటంతో.. వారి నోళ్లకు కళ్లెం పడనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ సమావేశం వల్ల కశ్మీర్‌ విషయంలో ప్రపంచ దేశాలకు భారత్‌పై సానుకూల సంకేతాలు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు.

 హౌదీ-మోదీ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇండో-అమెరికన్ ముస్లింలు కూడా కృషి చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ గౌరవార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ‘ఇండియన్ అమెరికన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ ప్రధాన వెల్‌కమ్ పార్టనర్‌లలో ఒకటిగా ఉంది. మరోవైపు, ఈ నెల 28న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న నేపథ్యంలో.. అంతకు ముందే.. మోదీ, ట్రంప్ ల సమావేశం ఆసక్తికరంగా మారింది.

ఇదిలావుంటే, కశ్మీర్ విషయంలో ట్రంప్-మోదీ లు కీలక ప్రటనలు వెలువరించే అవకాశం వుందన్న వాదనలు వినిస్తున్న నేపథ్యంలో.. లోయలో అలజడులు సృష్టించేందుకు పాక్ వెనకాడకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటి వరకు పాక్ అంతర్జాతీయ వేదికలపై చేసిన ఫిర్యాదులు ఫలించలేదు. ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరిగే సమయంలో కాశ్మీర్లో అలజడులు సృష్టిస్తే.. తద్వారా ఆ సమావేశాల్లో తమ వాదనకు బలం చేకూరుతుందని, ఎలాగైనా కశ్మీర్లో అలజడులు సృష్టించాలని పాక్ భావిస్తోంది. దీనికోసం భారీ కుట్రపన్నినట్టు.. ఐబీ హెచ్చరికలు జారీ చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అంతేకాదు, మోదీతో కలిసి అమెరికా వెళ్లాల్సిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. భారత్ లోనే ఉండి కశ్మీర్ విషయంపై దృష్టి పెట్టబోతున్నారట. పాక్ ఎత్తుగడలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.