Saturday, October 19, 2019
Follow Us on :

పాకిస్థాన్ ప్రధాని చెప్పినా ప్రయోజనం లేదు.. మొత్తం అబద్ధాలే చెబుతున్నారు

By BhaaratToday | Published On Aug 31st, 2019

పాకిస్తాన్‌లో సిక్కు పూజారి కుమార్తెను ఒక ముస్లిం యువకుడు వివాహం చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బలవంతంగా పెళ్లి చేసి మత మార్పిడి చేశారని యువతి కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై భారత్‌లో ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో పాకిస్తాన్‌ విచారణకు ఆదేశించింది.  ఈ ఘటనపై పంజాబ్‌ (భారత్‌) ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరారు. అలాగే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈ వీడియోను ట్వీట్‌ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని  కోరారు.

తమ కుమార్తె జగ్జీత్‌ కౌర్‌ గత మూడు రోజులుగా కనిపించడం లేదని లాహోర్‌లోని నంకనా సాహెబ్‌లోని సిక్కు పూజారి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం ఆ యువతి వీడియో ఒకటి బయటికొచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ స్పందించారు. నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.

అయితే ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేయగానే ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని, బాధితురాలు క్షేమంగా ఇంటికి చేరుకుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ అబద్ధాలే అని తెలుస్తోంది. ఆ అమ్మాయి ఇంత వరకు ఇంటికి చేరుకోలేదట.. ఈ విషయాన్ని ఆమె సోదరుడు తెలిపాడు. ఆమెను మాకు అప్పగించినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. ఆమెను మాకు ఎవరూ ఇంత వరకు అప్పగించలేదని.. ఇంత వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదని చెప్పుకొచ్చాడు.