Tuesday, October 15, 2019
Follow Us on :

విమానంలో అల్లాడిపోయిన ప్రయాణికులు

By BhaaratToday | Published On Feb 11th, 2019

క్యాబిన్‌లో పీడన సమస్య కారణంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. విమానంలో పీడనం తగ్గడంతో కొందరు ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం కారగా.. మరికొందరు చెవి నొప్పితో బాధపడ్డారు. మస్కట్‌ నుంచి కాలికట్‌ బయల్దేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 185 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఆదివారం మస్కట్‌ ఎయిర్‌పోర్టు నుంచి కాలికట్‌ బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రయాణికులు అస్వస్థతకు గురవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని మస్కట్‌ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. క్యాబిన్‌లో పీడన సమస్య ఏర్పడటంతో ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు ఎయిర్‌లైన్‌ ప్రతినిధి తెలిపారు. నలుగురు ప్రయాణికులకు ముక్కు నుంచి రక్తం కారగా.. మరికొందరు చెవినొప్పితో ఇబ్బంది పడ్డారు. వారికి విమానాశ్రయంలో వైద్య చికిత్స అందించారు. ప్రయాణికులు కోలుకున్న తర్వాత విమానం కాలికట్‌ బయల్దేరింది. ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.