Saturday, October 19, 2019
Follow Us on :

ఎట్ట‌కేల‌కు ఏపీకి కేంద్రం తీపి క‌బురు

By BhaaratToday | Published On Feb 28th, 2019

రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగేళ్ల 9 నెలలు గడుస్తున్న సమయంలో ఏపీకి ఎట్టకేలకు కేంద్రం తీపి కబురు అందించింది. విశాఖ కేంద్రంగా ఏపీలో కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తద్వారా దేశంలో 18వ రైల్వే జోన్‌ ఏర్పాటు కానుంది. ఈరైల్వే జోన్‌కు సౌత్‌కోస్ట్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు రైల్వే జోన్‌పై ప్రకటన వెలువడటంతో ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం రాత్రి రైల్వే భవన్‌లో రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాం : రైల్వే మంత్రి
‘విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. కొత్త రైల్వే జోన్‌ను ‘దక్షిణ కోస్తా రైల్వే (ఎస్‌సీఓఆర్‌)’గా వ్యవహరిస్తారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి ఈ రైల్వే జోన్‌ ఉంటుంది. వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని (ఏపీ పరిధిలోది) విజయవాడ డివిజన్‌లో విలీనం చేయడం ద్వారా నూతన రైల్వే జోన్‌ కిందికి తెస్తాం. వాల్తేరు డివిజన్‌లోని మిగిలిన భాగాన్ని (ఒడిశా ప్రాంతంలోది) రాయగడ కేంద్రంగా నూతన డివిజన్‌గా ఏర్పాటు చేస్తాం. అది తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్లతో కూడుకుని ఉంటుంది’ అని రైల్వే మంత్రి పేర్కొన్నారు. తదుపరి విధానపరమైన ప్రక్రియ కొనసాగుతుంది..’ అని పేర్కొన్నారు.