Saturday, October 19, 2019
Follow Us on :

ఆర్థిక మంత్రిగా రెండోసారి బాధ్యతలు..! బడ్జెట్ ప్రవేశపెట్టడం మాత్రం తొలిసారే..!!

By BhaaratToday | Published On Feb 1st, 2019

ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌. ఈ తాత్కాలిక బడ్జెట్‌ను తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాగా.. ఆర్థిక మంత్రిగా రెండోసారి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన గోయల్‌.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. గత ఐదు సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ ప్రస్తుతం అనారోగ్య కారణాల రీత్యా అమెరికాలో చికిత్స తీసుకుంటుండంతో గోయల్‌ బడ్జెట్‌ ప్రసంగం చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ కుమారుడే పీయూష్ గోయల్‌. 1964 జూన్‌ 13న గోయల్‌ జన్మించారు. ముంబయిలోని మతుంగాలో పాఠశాల విద్యను పూర్తిచేసిన గోయల్‌.. సీఏగా ఆల్‌ఇండియా రెండో ర్యాంక్‌ సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీలో చేరారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బోర్డుల్లో ప్రభుత్వ నామినీ సభ్యుడిగా పనిచేశారు.  బీజేపీలో అనేక కీలక పదవులు చేపట్టారు. 2016లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యుత్‌, బొగ్గు, గనుల శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరించారు. 2017 సెప్టెంబరు 3న గోయల్‌ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పీయూష్‌ గోయల్‌ ఆర్థిక మంత్రిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతేడాది మే నెలలో అరుణ్‌జైట్లీ కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో గోయల్‌కు ఆర్థికశాఖ బాధ్యతలు అప్పగించారు. 2018 మే నుంచి ఆగస్టు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఇటీవల జైట్లీ మరోసారి అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దీంతో గోయల్‌ మళ్లీ తాత్కాలిక ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టారు.