Saturday, October 19, 2019
Follow Us on :

బడ్జెట్ లోకి గోమాత..! ఎంత గొప్ప నిర్ణయం..!!

By BhaaratToday | Published On Feb 1st, 2019

గో సంరక్షణ కోసం కృషి చేస్తున్నామంటూ చెప్పుకొస్తున్న మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఈ సారి ప్రత్యేకంగా చోటు కల్పించింది. తాత్కాలిక ఆర్థికమంత్రిగా పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన పీయూష్‌ గోయల్‌ తన ప్రసంగ పాఠంలో గోవుల సంక్షేమానికి కూడా చోటు కల్పించారు. దేశంలోని ఆవుల సంరక్షణకు కేంద్రం ప్రత్యేకశ్రద్ధ తీసుకొందని పేర్కొంటూ.. త్వరలో ‘కామధేను యోజన’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. గోవులను గౌరవించుకునేలా, వాటిని అన్ని విధాల రక్షించుకునేందుకు ఈ పథకం రూపొందించామని చెప్పారు. ఈ పథకం ద్వారా గోవుల సంఖ్యను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్‌ అయినప్పటికీ, ఎన్నికల ఏడాది కావడంతో కేంద్రం భారీ తాయిలాలు ప్రకటించింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే గోవధ నిషేధ చట్లం అమలులో ఉంది. కానీ దాని అమలు పక్కాగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పథకం ద్వారా కొంత సానుకూలత రాబట్టుకోవచ్చనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు.