Saturday, December 07, 2019
Follow Us on :

బస్సు ప్రమాదం జరిగిందని తెలిస్తేనే.. అలాంటిది ఆ రాత్రి ఎలా నిద్ర‌పోగ‌ల‌ను?

By BhaaratToday | Published On Apr 6th, 2019

పుల్వామా దాడి తరవాత పాకిస్థాన్‌పై ప్రతీకారంగా భారత వైమానిక దళాలు చొచ్చుకెళ్లి బాలాకోట్‌లోని జైష్‌ ఉగ్ర శిబిరాలపై భీకర దాడులు చేశాయి. అయితే ఇదంతా ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన దీనిపై స్పందించారు. ‘వేకువజామున 3.40గంటల ప్రాంతంలో ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం అందింది. సైనికులంతా క్షేమంగా తిరిగొచ్చినట్లు చెప్పారు. అప్పటికీ నేను నిద్ర పోలేదు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా స్పందన వస్తుందేమోనని ఇంటర్నెట్‌లో వెతుకుతూ ఉన్నాను. 5.30గంటలకు దాడులకు సంబంధించి పాక్‌కు చెందిన ఓ అధికారి ట్వీట్‌ చేశారు’ అని మోదీ తెలిపారు. 

బాలాకోట్‌ ఆపరేషన్‌కు సంబంధించి ప్రతి క్షణం సమాచారం మీకు అందిందా అని అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఇస్తూ..‘‘ఏదైనా బస్సు ప్రమాదం జరిగిందని తెలిస్తేనే నేను ప్రతి నిమిషం దానిపై సమాచారం తెలుసుకుంటూ ఉంటా. ఇక ఆపరేషన్‌ జరుగుతుందని తెలిసి నేను ఎలా నిద్రపోగలను?’’ అని అన్నారు. దాడులకు సంబంధించిన సాక్ష్యాలను ప్రతిపక్షాలు కోరుతుండడంపై ఆయన మాట్లాడుతూ..‘‘పాక్‌ అధికారి ట్వీట్‌ చేయడమే ఓ పెద్ద సాక్ష్యం. దాడులను మాకంటే ముందు వారే బహిర్గతం చేశారని.. దాడికి సంబంధించి పాక్‌ ఓ స్థాయికి మించి వాదించలేదని.. లేదంటే వారు అక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని అంగీకరించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.