Sunday, August 18, 2019
Follow Us on :

పాక్ ప్రచారం ప్రపంచానికి వినిపించేలా కాంగ్రెస్ సాయం

By BhaaratToday | Published On Apr 7th, 2019

కాంగ్రెస్ పాకిస్థాన్ పాట పాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన ఆదివారం ఓ ప్రచార సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను పరిశీలిస్తే.. భారత దేశం గురించి పట్టించుకోకుండా ఆ పార్టీ పాకిస్థాన్ పాట పాడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 370ని ఎవరూ మార్చలేరని కాంగ్రెస్ అంటోందని, దీంతో పాకిస్థాన్ కూడా ఏకీభవించిందని చెప్పారు. 

పాకిస్థాన్ చేస్తున్న ప్రచారం ప్రపంచంలో అన్ని మూలలకు వ్యాపించే విధంగా కాంగ్రెస్ సహాయపడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ విడుదల చేసిన నయవంచక పత్రం (ఎన్నికల మేనిఫెస్టో)ను బట్టి ఆ పార్టీ భారత దేశాన్ని పక్కనబెట్టి, పాకిస్థాన్ పాట పాడుతున్నట్లు తెలుస్తోందన్నారు. భారత దేశానికి, జమ్మూ-కశ్మీరుకు వేర్వేరు ప్రధాన మంత్రులు ఉండాలని కోరుకునేవారికి కాంగ్రెస్ అండగా నిలబడుతోందని ఆరోపించారు. మన దేశంలో మొట్టమొదటిసారి అధికార పార్టీకి అనుకూలత, ప్రతిపక్షాలపై ఆగ్రహం కనిపిస్తోందన్నారు. మణిపూర్‌లో హింసాత్మక చరిత్రకు తెరపడిందన్నారు.