Thursday, December 05, 2019
Follow Us on :

వారసత్వ రాజకీయాలపై నిప్పులు చెరిగిన మోదీ

By BhaaratToday | Published On Apr 12th, 2019

వారసత్వ రాజకీయాలపై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోడీ. తాను మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్భంధన్ నాయకుల అవినీతి బాగోతాన్ని ఎక్కడ బయటపెడుతానో అని భయపడుతున్నారని మోదీ అన్నారు. బీహార్‌, అస్సోలలో పర్యటించిన ప్రధాని మోదీ విపక్షాలపై మండిపడ్డారు. బీహార్ లోని భగల్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. తమ ప్రభుత్వం దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని జవాన్లకు పూర్తి అధికారాలు ఇస్తే విపక్షాలు తప్పుబడుతున్నాయని ధ్వజమెత్తారు. జవాన్లకు పూర్తి అధికారాలు ఇస్తేనే ఉగ్రవాదులను, నక్సలైట్లను ఏరిపారేస్తారని మోదీ అన్నారు.
మరోవైపు.. బయటకు మాత్రం జవాన్ల గురించి ప్రస్తావిస్తున్నట్లు కనిపిస్తున్న విపక్ష పార్టీల నేతలు లోపల మరో విషయం గురించి భయపడుతున్నారని మోదీ అన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే విపక్ష నేతల అవినీతి బాగోతం ఎక్కడ బట్టబయలు అవుతుందోనని వారు భయపడుతున్నారని మోదీ విమర్శించారు.
అటు... రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ అంబేడ్కర్ ప్రవేశ పెట్టిన రిజర్వేషన్లను తమ ప్రభుత్వం పటిష్ట పరిచేందుకు ప్రయత్నాలు చేస్తోందని మోదీ వెల్లడించారు. మోదీ అధికారంలోకి వస్తే ఇకపై దేశంలో ఎన్నికలు జరగవని అన్ని రాజ్యాంగ సంస్థలు తమ గుప్పిట్లోకి వెళతాయనే తప్పుడు ప్రచారం చేస్తున్న విపక్షాలపై ప్రధాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికి కాపలాదారుడిగా ఉన్న తాను.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ కోటాను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే బీహార్‌ అభివృద్ధి రెట్టింపు అవుతుందని మోదీ తెలిపారు. 
ఇదిలా ఉండగా.. దేశ రక్షణ విషయంలో ఎవరైనా రాజీ పడతారా.. తీవ్రవాదులతో చేతులు కలుపుతారా అని ప్రశ్నించిన ప్రధాని మోదీ.. దురదృష్టవశాత్తూ సైనికుల మనోధైర్యాలను అనుమానిస్తూ.. వారు జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ కు సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ.. భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని విపక్షాలు కించపరుస్తోందని మండిపడ్డారు. మొత్తంమ్మీద సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.