Wednesday, October 16, 2019
Follow Us on :

విశాఖ వాసుల చిరకాల కల..! మార్చి 1వ తేదీన ఏం జరగబోతుంది..?

By BhaaratToday | Published On Feb 23rd, 2019

విశాఖకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 1న వస్తున్నారు. దేశ ప్రధాని వస్తున్నారంటే ఆ సభపై అంచనాలు ఒక స్థాయిలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఇప్పుడు చర్చంతా.. రైల్వేజోన్‌ ఇస్తారా? రైల్వేజోన్‌పై ఏ మాటలు చెప్పబోతున్నారు? అని విశాఖవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పైగా రైల్వే మైదానంలోనే సభా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రైల్వే స్థలమే మోడీ సభకు వేదిక కావడంతో ఏ హామీలు విశాఖకు ఇస్తారు? లేకుంటే దానికి బలం చేకూరేలా ప్రకటనలుంటాయా? లేదా? అనే చర్చ జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే విభజన చట్టంలో ఏపీకి ఇస్తామని ప్రకటించిన రైల్వే జోన్ హామీని నిలబెట్టుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్‌తో సమావేశమైన ఏపీ బీజేపీ నేతలు కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు, మాధవ్ తదితరులు... ఈ అంశంపైనే ఎక్కువగా చర్చించారని తెలుస్తోంది. దీంతో ఏపీకి కేంద్రం ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశాఖ ప్రజల అకాంక్ష అయిన ప్రత్యేక రైల్వే జోన్ హామీ నెరవేర్చడం వల్ల... అనేక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ భావిస్తోంది. 2014లో విశాఖ ఎంపీ సీటుతో పాటు విశాఖలోని ఓ ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న బీజేపీ... మళ్లీ అక్కడ తన పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం విశాఖ రైల్వే జోన్ హామీని నెరవేరిస్తే బాగుంటుందని ఏపీ బీజేపీ నేతలు కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లారని... వారు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతోంది.