Wednesday, October 16, 2019
Follow Us on :

తర్వాత ప్రధాని ఆయనే... పీకే సంచలన వ్యాఖ్యలు...

By BhaaratToday | Published On Feb 12th, 2019

లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో ప్రధాని అభ్యర్థి మారే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలను సైతం పీకే కొట్టిపారేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయేలో ‘‘పెద్ద నేత’’ అయినప్పటికీ.. ఆయనను ప్రధాని పదివికి పోటీదారుగా భావించడం ‘‘భావ్యంకాదని’’ స్పష్టం చేశారు. ఎన్నికల కోసం వ్యూహం రచించడంలోనూ, ప్రజల నాడిని పసిగట్టడంలోనూ దిట్టగా పేరున్న ప్రశాంత్ కిశోర్.. గతేడాది సెప్టెంబర్‌లో జేడీయూలో చేరారు. బీజేపీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న శివసేన చీఫ్ ఉద్థవ్ థాకరేతో ఇటీవల ఆయన సమావేశం కావడంతో... శివసేన, జేడీయూల మధ్య వ్యూహాత్మక పొత్తు కుదరబోతోందంటూ జోరుగా ప్రచారం సాగింది. ఎన్నికల వేళ మోడీ నాయకత్వానికి ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీకే స్పందిస్తూ.. ‘‘శివసేన చీఫ్ ఆహ్వానం మేరకే నేను ఆయనతో సమావేశం అయ్యాను. ఆ పార్టీ ఇప్పటికీ ఎన్డీయే భాగంగానే ఉంది. కాబట్టి మేము ఇద్దరం చాటుమాటుగా మాట్లాడుకోవాల్సిన అవసరంలేదు. ఇందులో ఎన్నికల వ్యూహం కూడా ఏదీ లేదు. ఇప్పుడు నేను ఓ పార్టీ సభ్యుడిని కాబట్టి అలాంటి వృత్తిపరమైన సహకారం ఇస్తానని చెప్పలేను..’’ అని వెల్లడించారు.
బీహార్‌లోని బక్సర్ జిల్లాకి చెందిన ప్రశాంత్ కిశోర్... 2014లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ తరపున ప్రచారం చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎన్నడూ రానంత భారీ మెజారిటీ సాధించడం వెనుక ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ మరుసటి ఏడాదే నితీశ్ కుమార్ కోసం పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయం కట్టబెట్టడంతో పీకేకి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించింది.