Friday, July 19, 2019
Follow Us on :

శత్రువు గడ్డపై ఎనలేని తెగువ..వీరజవాన్‌కు అభినందనల వెల్లువ

By BhaaratToday | Published On Mar 1st, 2019

► శత్రువు గడ్డపై ఎనలేని తెగువ..వీరజవాన్ కు అభినందనల వెల్లువ
► అభినందన్ అప్పగింతకు ఓకే చెప్పిన ఇమ్రాన్
► నేడు మాతృభూమికి రానున్న వీర జవాన్
► అభినందన్ విడుదలపై సర్వత్రా హర్షం

ఫలించిన భారత దౌత్యం. ప్రపంచ దేశాల ఒత్తడి ఫలితం. పాక్ చేరవీడనున్న అభినందన్. అప్పగింతకు ఓకే చెప్పిన ఇమ్రాన్. శత్రువు గడ్డపై ఎనలేని తెగువ. వీరజవాన్ కు అభినందనల వెల్లువ. వీరుడా.. స్వాగతం.. ఇదే భార‌త్ టుడే స్పెష‌ల్ స్టోరీ.

విక్రమ్ అభినందన్ క్షేమంగా భారత్ కు తిరిగిరాలని భారతీయులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. శుక్రవారం భారత్ లో విక్రమ్ అడుగుపెట్టబోతున్నారు. భారత ప్రభుత్వ దౌత్యం, అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్.. యుద్ధ ఖైదీగా చిక్కిన మన వీరజవాన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

అభినంద‌న్ విడుద‌ల‌పై దేశ ప్ర‌జ‌ల్లో సందేహాలు :
పాకిస్తాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ పై విడుదలపై దేశ ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. భారత్ పై ఉన్న పగను పాకిస్తాన్ అభినందన్ పై తీర్చుకుంటుందని, ఆయనను చిత్రహింసలకు గురి చేస్తుందంటూ అనుమానాలు వెల్లువెత్తాయి. అభినందన్ తమ చేతికి చిక్కిన వెంటనే పాక్ బలగాలు ప్రవర్తించిన తీరు కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో, అనూహ్యంగా పాకిస్తాన్ నుంచి ఓ సానుకూల ప్రకటన వచ్చింది. అభినందన్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, అభినందన్ ను విడుదల చేస్తామని ప్రకటిస్తూనే.. ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన ద్వంద్వ నీతిని ప్రదర్శించారు.

పాకిస్తాన్ కుటిల‌నీతిని ఎండ‌గ‌ట్టిన భార‌త త్రివిధ ద‌ళాలు:
పాకిస్తాన్ కుటిలనీతిని భారత త్రివిధ దళాలు మీడియా సాక్షిగా ఎండగట్టాయి. ఆ దేశం అబద్ధాల పుట్ట అంటూ త్రివిధ దళాల అధికారులు మండిపడ్డారు. పాకిస్తాన్ యుద్ధ విమనాలు భారత గగనతలాన్ని అతిక్రమించిన విషయాన్ని సాక్షాలతో సహా వెల్లడించారు. అంతేకాదు, తమ పోరాటం ఉగ్రవాదంపైనేనని.. శత్రువు పెంచిపోషిస్తున్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు తప్పవని హెచ్చరించారు. పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదం అంతమొందించే వరకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

పుల్వామా ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా...
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్ మొహ్మద్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడులను ఓర్చుకోలేని పాకిస్తాన్‌...భారత్‌పై ప్రతీకారదాడులకు దిగింది. అయితే, భారత భూభాగంపై దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్‌ ఫైటర్ జెట్లను మిగ్ 21లో తరిమికొట్టేందుకు వెళ్లాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. అదేసమయంలో పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చిన అభినందన్ నడిపిన మిగ్ విమానం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కూలిపోయిది. కానీ, పారాచూట్ సాయంతో అభినందన్ ప్రాణాలతో బయటపడ్డాడు. 

అయితే, అభినందన్ పీవోకేలో దిగడంతో.. పాకిస్థాన్ సైనికులు ఆయన్ను బందీగా పట్టుకున్నారు. అతనిపై కొందరు తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడి ముఖంపై గాయమైంది. తర్వాత అభినందన్ పాక్ ఆర్మీ అధికారులు ప్రశ్నించారు. తమ వద్ద ఓ పైలెట్ కస్టడీలో ఉన్నట్టు ప్రకటించారు. దీన్ని భారత్ కూడా ధ్రువీకరించింది. అతడిని వెనక్కి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం ప్రకటించింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకి చేసింది. భారత్ చర్యలను అనేక దేశాలు సమర్థించాయి. పైగా, ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నా ధ్వంసం చేయాల్సిందేనంటూ అంతర్జాతీయ సమాజం నొక్కివక్కాణించింది. దీనికితోడు బందీగా ఉన్న భారత పైలట్ అభినందన్‌ను తక్షణం విడుదల చేయాలని పాక్‌పై ఒత్తిడి పెరిగింది.

పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోడీ :
జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని, వారం రోజుల్లోగా విక్రమ్ అభినందన్‌ను విడుదల చేయకుంటే అధికారికంగా యుద్ధం ప్రకటించినట్లే భావించాలని పాక్‌కు బుధవారం భారత ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అభినందన్ ను విడుదల చేయాలని, ఉగ్రవాదంపై పాక్ తన వైఖరి మార్చుకోవాలని చైనా, రష్యాలు కూడా ఒత్తిడి తీసుకొచ్చాయి. మరోవైపు తన మిత్ర దేశం చైనా కూడా పాక్ కు మద్దతు విషయంలో వెనకడుగు వేయడంతో దిక్కుతోచని స్థితిలో కాళ్లబేరానికి వచ్చింది. భారత్ తో శాంతి చర్చలకు తాము సిద్ధమని, ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్‌లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడని పాక్ విదేశాంగ శాఖ మంత్రి గురువారం ఉదయమే ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే అభినందన్ విడుదలపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారిక ప్రకటన చేశారు. అయితే విడుదల చేయాలనుకున్న తమ నిర్ణయాన్ని పిరికితనంగా భావించవద్దని ఇమ్రాన్ అన్నారు. అభినందన్ ను విడుదల చేయాలని ప్రపంచదేశాలు పాక్ పై ఒత్తిడి పెంచడంతో దిక్కుతోచని స్థితిలో అభినందన్ విడుదలకు పాక్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

అభినంద‌న్ విడుద‌ల ప్ర‌క‌ట‌న‌తో దేశంలో పండుగ వాతావ‌ర‌ణం :
అభినందన్ విడుదల ప్రకటనతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. మొత్తానికి భారత్ అంతర్జాతీయంగా తీసుకు వచ్చిన తీవ్ర ఒత్తిడి ద్వారా పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది. స్వయంగా పాకిస్తాన్ ప్రధానే ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా అభినందన్ విడుదలపై ప్రకటన చేశాడంటే ఒత్తిడి ఏమేర ఫలించిందో అర్థం చేసుకోవచ్చు. విడుదల ప్రకటన చేస్తున్న సందర్భంలో.. తాను ప్రధాని మోదీకి ఫోన్ చేస్తే రియాక్ట్ అవ్వలేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే, మోదీ రియాక్ట్ కాకపోవడం వెనుక కూడా పెద్ద వ్యూహమే వున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మోదీ కనుక స్వయంగా ఫోన్ లో ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడితే.. పాకిస్తాన్ అనేక షరతులు విధించే అవకాశం ఉండేది. అందుకే మోదీ అంతర్జాతీయంగా అన్ని దేశాల ద్వారా పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. 

ఇన్నాళ్లూ వివిధ దేశాలతో మోదీ నెరపిన దౌత్యం ఈ రకంగా మనకు ఫలితాన్నిచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మన పైలెట్ ను విడుదల చేస్తామన్న ప్రకటన వెనుక పాక్ ద్వంద్వ నీతి కనపడుతోంది. మొన్న జరిగిన పుల్వామా ఉగ్రదాడిని, దాడిలో మరణించిన మన అమర జవానుల సంఘటనను మరిపించే దిశగా ఆ దేశం పావులు కదిపినట్టు తెలుస్తోంది. తద్వారా భారత్ ఆవేశాన్ని కొంతమేరకైనా తగ్గించవచ్చనేది పాక్ ప్లాన్ గా అర్థం చేసుకోవాలంటున్నారు రక్షణ నిపుణులు.