Thursday, April 25, 2019
Follow Us on :

ప్రియాంక‌కు మ‌రో అరుదైన గౌర‌వం

By BhaaratToday | Published On Mar 20th, 2019

విశ్వ‌సుంద‌రి, బాలీవుడ్ న‌టి ప్రియాంకా చోప్రా మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. వినోద రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఆమె చోటుదక్కించుకున్నారు. ఈ మేరకు యూఎస్‌ఏ టుడే  ‘విమెన్‌ ఇన్‌ ది వరల్డ్‌ సమ్మిట్‌ 2019’ జాబితాను ప్రకటించింది. న్యూయార్క్‌లో ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు వేడుక జరగనుంది. ఈ జాబితాలో గాయని బియాన్సే, టీవీ స్టార్‌ ఎలెన్‌ దెజానరెస్‌, జెన్సీఫర్‌ లారెన్స్‌, జెన్సీఫర్‌ లోపెజ్‌ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘సవాళ్లను ఎదుర్కొంటూ.. సొంతంగా తమకంటూ ఓ ప్రత్యేకమైన మార్గం ఏర్పరచుకుని.. ఎంచుకున్న కెరీర్‌లో గర్వంగా రాణిస్తున్న ఇలాంటి అద్భుతమైన మహిళలతో కలిసి వేదిక పంచుకోబోతుండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది నా విజయం అనే భావన కల్గుతోంది’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం ప్రియాంక ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వాసిమ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.