Wednesday, October 16, 2019
Follow Us on :

భారత ఆటగాళ్లకు అంత తక్కువ ప్రైజ్ మనీనా.. ధోని, చాహల్ కు ఎంత తక్కువ ఇచ్చారో తెలుసా..?

By BhaaratToday | Published On Jan 19th, 2019

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..! మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. భారత్ సాధించిన విజయానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇచ్చిన ప్రైజ్ మనీపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత తక్కువ ప్రైజ్ మనీ ఎవరూ ఇవ్వరని.. కావాలనే క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా చేసిందా అని అందరూ విమర్శిస్తున్నారు. భారత్ తో సిరీస్ అంటే చాలు కోట్ల రూపాయలు ఏ క్రికెట్ బోర్డుకు అయినా వస్తాయి. కానీ ఇవేవీ పట్టించుకోని క్రికెట్ ఆస్ట్రేలియా కేవలం 500 డాలర్లు(రూ.35,000) ఇవ్వడం ఏంటని  పలువురు ప్రశ్నించారు.  సిరీస్ ముగిశాక లెగ్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించగా, ధోనీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతి దక్కింది. ఈ సందర్భంగా నిర్వాహకులు, క్రికెట్ ఆస్ట్రేలియా వీరిద్దరికీ చెరో 500 డాలర్ల చెక్కును అందించారు. 

 

టోర్నీ నిర్వాహకులు, క్రికెట్ ఆస్ట్రేలియా ఇచ్చిన నగదు బహుమతిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 యూఎస్‌ డాలర్లు ఇవ్వడం ఏంటి? సిరీస్‌ గెలిస్తే భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే దక్కింది. టోర్నీ నిర్వాహకులు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు. బ్రాడ్‌కాస్ట్‌ హక్కుల పేరిట బాగా సంపాదించుకున్నారు కదా.. ఆటగాళ్లకు మంచి నగదు బహుమతి ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఆటగాళ్ల వల్లనే స్పాన్సర్లు వస్తారని తెలియజేశారు గవాస్కర్.  ఆటగాళ్ల వల్లనే క్రీడల్లో కాసుల వర్షం కురుస్తుంది. వారికి గౌరవప్రదమైన నగదు పురస్కారం ఇవ్వాలని గవాస్కర్‌ సూచించారు.