Monday, November 18, 2019
Follow Us on :

శత్రుదేశానికి బుద్ధి చెప్పాల్సిందే...

By BhaaratToday | Published On Feb 16th, 2019

జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడిపై భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. దేశంలోని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. 2016 సర్జికల్ స్ట్రయిక్స్ చేశారని, ఇప్పుడు మరోసారి చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఉగ్రవాద దేశాన్ని ఉపేక్షించి లాభం లేదని దేశం మొత్తం ముక్తకంఠంతో నినదిస్తోంది. అటువైపు నుంచి సరైన స్పందన లేనప్పుడు మనం శాంతిగా ఉండటంలో అర్థం లేదనే వాదన క్రమంగా బలపడుతోంది. మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్లకు పట్టణాలు, గ్రామాల కూడళ్లలో నివాళులు అర్పిస్తూ, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా తమ తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. పలు స్కూళ్లలో కొవ్వొత్తులతో సంతాపం వ్యక్తం చేశారు. అటు అమర జవాన్ల కుటుంబ సభ్యులు కూడా పాకిస్తాన్ పై యుద్ధం చేయాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. శత్రుదేశానికి బుద్ధి చెప్పాల్సిందేనని.. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే కార్యాచరణ చేపట్టాలని చెబుతున్నారు.

శత్రుదేశానికి తగిన సమాధానం చెప్పడం కోసం.. తన మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తానంటూ.. పుల్వామా దాడిలో మరణించిన రతన్ ఠాకూర్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక, ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్ల పార్థివదేహాలను వారి స్వస్థలాలకు పంపించారు. అంతకుముందు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అధికార లాంఛనాల మధ్య ప్రభుత్వాధినేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలు అమరవీరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలావుంటే, పాకిస్తాన్ దుశ్చర్యను అంతర్జాతీయ సమాజం కూడా ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఉగ్రవాద దేశంపై అగ్రరాజ్యం అమెరికా సైతం నిప్పులు చెరిగింది. పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరించింది. తీరు మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. ముష్కరులకు సహకారం అందించే విషయంలో పాకిస్తాన్ చూపిస్తున్న చొరవ సరికాదంటూ మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా హింసను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు పనిచేస్తున్నారని అమెరికా మండిపడింది. ఉగ్రవాద మూలాలను అంతమొందించేందుకు భారత్ కు అన్నీ స్థాయిల్లో పూర్తి మద్దతిస్తామని ప్రకటించింది. ఉగ్రవాద నిర్మూలనకు భారత్ తో కలిసి పనిచేస్తామని తెలిపింది.