Monday, November 18, 2019
Follow Us on :

ఇంకా.. ఉపేక్షిద్దామా..? లేక.. బుద్దొచ్చేలా బదులిద్దామా..?

By BhaaratToday | Published On Feb 16th, 2019

కశ్మీర్ లోయలో రక్తపాతం. పంజా విసిరిన ఉగ్రభూతం. పోరాడలేని పాకిస్తాన్ కుక్కలు పుల్వామాలో దొంగదెబ్బ తీసారు. నాడు శాంతి మంత్రానికి లొంగలేదు. ఆ తర్వాత మెరుపు దాడులతోనూ తీరు మార్చుకోలేదు. మరి, ఇంకా ఉపేక్షిద్దామా..? లేక బుద్దొచ్చేలా బదులిద్దామా..? ఇండియా వాంట్స్ రివేంజ్..!.. ఇదే భార‌త్ టుడే ప్ర‌త్యేక క‌థ‌నం.

కశ్మీర్ లోయ మరోసారి ఉలిక్కిపడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రభూతం రక్తపాతం సృష్టించింది. భారత్ పై నరనరానా విద్వేషం నింపుకున్న జైషే మహమ్మద్ ఉగ్రరక్కసి.. పుల్వామాలో కరాళ నృత్యం చేసింది. భారత జవాన్లకు ఎదురుపడి నిలువలేని ముష్కర మూకలు.. దొంగదెబ్బతీసి 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్నారు.

పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారత్ అట్టుడికిపోతోంది. ఉగ్ర మూకల పిరికిపంద దాడిని ముక్తకంఠంతో ఖండిస్తోంది. దెబ్బకు దెబ్బ అన్నట్టు ప్రతీకార దాడికి సిద్ధం కావాలని భద్రతా దళలాకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. టైం, ప్లేస్ నిర్ణయించుకునేందుకు సర్వ అధికారాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆ దేశం చిప్ప పట్టుకుని అడుక్కుంటోందని.. అది ఆర్థికంగా దివాళా తీస్తే.. భారత్ సహా ఏ దేశం కూడా సహాయం అందించదని.. పాకిస్తాన్ పై మండిపడ్డారు ప్రధాని మోదీ.

ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న శత్రుదేశం పాక్ కు గుణపాఠం చెప్పే పనిలో మోదీ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. అంతర్జాతీయ యవనికపై పాక్ ను ఒంటరి చేసే దిశగా అడుగులు చకచకా కదుపుతోంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో భారత్ అత్యున్నత సమావేశం నిర్వహించి.. వారికి అందించాల్సిన సమాచారం అందించినట్టు తెలుస్తోంది.

సమయం.. గురువారం మధ్యాహ్నం 3.15 నిమిషాలు. తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో సెలవుల్ని సరదాగా గడిపిన మన వీరజవాన్లు.. తిరిగి దేశరక్షణకు అంకితమవుతున్నారు. మంచుకొండల్లో కర్తవ్య నిర్వహణకు సిద్ధమవుతున్నారు. 2 వేల 500 మందితో కూడిన సీఆర్పీఎఫ్ జవాన్ల వాహణశ్రేణి.. జమ్ము - శ్రీనగర్ హైవేలో దూసుకుపోతోంది. వీరి వాహనాలు సూర్యాస్తమయంలోగా 266 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్‌కు చేరుకోవాల్సి ఉంది. 

ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్‌–జమ్మూ జాతీయ రహదారిపై భద్రతాబలగాల వాహనాలు ఒకదానివెంట మరొకటి వెళుతున్నాయి. కుటుంబ సభ్యులతో గడిపిన మధురు క్షణాలను నెమరువేసుకుంటూ.. విధుల్లోకి వెళ్తున్న వీరజవాన్లపై ఒక్కసారిగా ఉగ్రరక్కసి పంజా విసిరింది. ఎదురపడి పోరాడే శక్తిలేని పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. వెంటనే దారి పక్కనుంచి బుల్లెట్లు దూసుకొచ్చాయి. అంతే.. క్షణాల్లో మంచు దారులు రక్తసిక్తమయ్యాయి. 44 మంది వీరజవాన్లు అమరులయ్యారు.

నివురుగప్పిన నిప్పులా వున్న ఉగ్రవాదం.. కశ్మీర్ లోయలో మరోసారి బుసలు కొట్టింది. కశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురలో జరిగిన ఉగ్రదాడికి దేశం మొత్తం ఉలిక్కిపడింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్.. 350 కేజీల పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనంలో ఎదురుగా వచ్చి సీఆర్పీఆఫ్ కాన్వాయ్ ను ఢీకొట్టాడు. ఇంతలో ఒక్కసారి పెద్దయెత్తన పేలుడు సంభవించింది. పేలుడు దాటికి వాహనశ్రేణిలో ముందున్న బస్సు తునాతునకలైంది. బస్సులో ప్రయాణిస్తున్న జవాన్ల శరీరాలు గుర్తుపట్టకుండా ఛిద్రమైపోయాయి. ఏం జరిగిందో తెలిసేలోగా 44 మంది వీరజవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనలో వందలాది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఉగ్రదాడితో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను శ్రీనగర్‌లోని 92 బేస్‌ బదామీగఢ్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లలో చాలామంది ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. ఈ దాడి చేసింది తామేనంటూ.. జైషే మహమ్మద్‌ ప్రకటించుకుంది. 2016 సెప్టెంబర్‌ 18న కశ్మీర్‌లో ఉడీ ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడి తర్వాత భద్రతాబలగాలు భారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. నాడు ఉరి ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

దశాబ్దాలుగా భద్రతా దళాలపై ఉగ్రమూకలు అడపాదడపా దాడికి పాల్పడుతూనేవున్నాయి. 
► 1999 నవంబర్‌ 3న  బాదామిబాగ్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్‌ వద్ద దాడి చేసి 10 మంది సైనికులను చంపేశారు. 
► 2000 ఏప్రిల్‌ 19న శ్రీనగర్‌లోని బాదామిబాగ్‌లో ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద తొలిసారిగా కారుతో ఆత్మాహుతి దాడి. ఇద్దరు సైనికులు మరణించారు.
► 2000 ఆగస్ట్‌ 10న శ్రీనగర్‌లోని రెసిడెన్సీ రోడ్‌లో భద్రతా సిబ్బందిపై జరిగిన గ్రెనేడ్‌ దాడి, కారు బాంబు పేలుడులో 11 మంది సైనికులు, ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు.
► 2001 అక్టోబర్‌ 1న శ్రీనగర్‌లోని పాత శాసనసభ కాంప్లెక్స్‌ వెలుపల సంభవించిన కారు బాంబు పేలుడులో 38 మంది దుర్మరణం పాలయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 
► 2001 నవంబర్‌ 17న రాంబన్‌ లోని భద్రతా దళ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో 10 మంది సైనికులు మరణించారు. నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. 
► 2002 మే 14న కలుచాక్‌ ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడిలో 36 మంది సైనికులు నేలకొరిగారు.
► 2003 జూన్‌ 28న సన్జాన్‌ ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది సైనికులు అమరులు కాగా.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతమయ్యారు. 
► 2003 జులై 22న అక్నూర్‌లోని సైనిక శిబిరంపై జరిగిన దాడిలో బ్రిగేడియర్‌ సహా ఎనిమిది మంది సైనికులు మరణించారు.
► 2004 ఏప్రిల్‌ 8న బారాముల్లా జిల్లాలోని ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై జరిగిన గ్రెనేడ్‌ల దాడిలో 11 మంది చనిపోయారు. 
► 2005 జూన్‌ 24న శ్రీనగర్‌ శివార్లలో కారు బాంబును పేల్చిన ఉగ్రవాదులు.. తొమ్మిది మంది సైనికులను పొట్టనబెట్టున్నారు. 
► 2005 జూలై 20న భద్రతా దళాల కాన్వాయ్‌పై కారుతో ఆత్మాహుతి దాడి చేసిన ముష్కరులు.. ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులను చంపేశారు. 
► 2005 నవంబర్‌ 2న నౌగమ్‌లో నాటి సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఇంటి దగ్గర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు పోలీసులు, ఆరుగురు పౌరుల ప్రాణాలు కోల్పోయారు. 
► 2008 జూలై 19న శ్రీనగర్‌–బారాముల్లా రహదారిపై నరబల్‌ వద్ద రోడ్డు పక్కన ఐఈడీ అమర్చి పేల్చడంతో పది మంది సైనికులు చనిపోయారు. 
► 2013 జూన్‌ 24న హైదర్పోరా వద్ద సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సైనికుల మృతి చెందారు. 
► 2014 డిసెంబర్‌ 5న మొహ్రాలో ఆర్మీ శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో పది మంది సైనికులు ప్రాణాలు వదిలారు. 

► 2016 జూన్‌ 3న పాంపోర్‌లో సీఆర్పీఎఫ్‌ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులు ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డారు. దీంతో రెండ్రోజులు కొనసాగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులంతా హతమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయారు. 
► 2016 జూన్‌ 25న శ్రీనగర్‌–జమ్మూ హైవేపై పాంపోర్‌ వద్ద సీఆర్పీఎఫ్‌ బస్సుపై ఉగ్రకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయారు. 
► 2016 సెప్టెంబర్‌ 18న బారాముల్లా జిల్లాలోని ఉరిలో ఆర్మీ శిబిరంపై నలుగురు పాక్‌ తీవ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ దాడి చేసింది. 
► 2016 నవంబర్‌ 29న నాగ్రోటా సైనిక ఆయుధాగారంపై జరిగిన దాడిలో ఏడుగురు సైనికులు మరణించారు. చివరిసారిగా.. 2017 ఆగస్ట్‌ 26న ఇదే పుల్వామా జిల్లా పోలీస్‌ లైన్స్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది భద్రత సిబ్బంది మృతి చెందారు.